జియో దెబ్బకు మిగతా టెలికం నెట్‌వర్క్స్ కూడా దిగి వస్తున్నాయి. జియోకు పోటీగా నిలిచేందుకు..బంపర్ ఆఫర్లు ప్రకటిస్తున్నాయి. ఇప్పటికే జియో షాక్తో ఎయిర్టెల్, వొడాఫోన్ దిగొచ్చి, అపరిమిత వాయిస్ కాలింగ్ ఆఫర్లను వినియోగదారుల ముంగింట్లోకి తెచ్చాయి. వీటి బాటలోనే తాజాగా ప్రభుత్వ రంగ టెలికాం దిగ్గజం బీఎస్ఎన్ఎల్ కూడా వినియోగదారులకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. ప్రీపెయిడ్ కస్టమర్లకు పరిమిత ఉచిత డేటాతో కూడిన అపరిమిత వాయిస్ కాలింగ్ ఆఫర్ను అందుబాటులోకి తీసుకొస్తున్నట్టు తెలిపింది. దీనికోసం కేవలం రూ.99తో రీఛార్జ్ చేపించుకుంటే చాలని బీఎస్ఎన్ఎల్ పేర్కొంది. రూ.99తో రీచార్జ్ చేపించుకుంటే నెల రోజుల పాటు అపరిమితంగా లోకల్ కాల్స్, బీఎస్ఎన్ఎల్ నుంచి బీఎస్ఎన్ఎల్ ఎస్టీడీ కాల్స్ వాడుకోవచ్చని, వాటితో పాటు 300 ఎంబీ డేటా కూడా ఉచితంగా అందుబాటులో ఉంచుతామని కంపెనీ ఓ ప్రకటనలో తెలిపింది.
ఈ రేట్ కోల్కత్తా టీడీ, పశ్చిమబెంగాల్, బిహార్, జార్ఖాండ్, అసోం, గుజరాత్, మధ్యప్రదేశ్, చత్తీస్ఘడ్, మహారాష్ట్ర, రాజస్తాన్లు నెట్వర్క్ పరిధిలోని కాల్స్కు అందుబాటులో ఉంటుంది. ఇదే ఆఫర్ ఇతర సర్కిళ్లలో రూ.119 నుంచి రూ.149కు కల్పిస్తామని కంపెనీ పేర్కొంది. అదేవిధంగా కొత్త కోంబో ఎస్టీవీ ఆఫర్ను కూడా కంపెనీ తీసుకొచ్చినట్టు తెలిపింది. ఈ ఆఫర్ కింద రూ.339కు నెలరోజుల పాటు అపరిమిత లోకల్, ఎస్టీడీ కాల్స్ను బీఎస్ఎన్ఎల్ నుంచి ఏ నెట్వర్క్కైనా చేసుకునేలా అవకాశం కల్పిస్తూ 1జీబీ డేటాను అందుబాటులో ఉంచింది.. 30 రోజుల వాలిడిటీతో బీఎస్ఎన్ఎల్ ఇప్పటికే అపరిమిత 3జీ సర్వీసులను రూ.1099కు అందిస్తోంది.