రాష్ట్రంలో యూరియా కోసం రైతులు సొసైటీల దగ్గర, ఫర్టిలైజర్ దుకాణాల దగ్గర లైన్లో పెట్టిన చెప్పులు.. రేపు స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓట్ల కోసం వచ్చే కాంగ్రెస్ నాయకులకు చూపించాలని బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్, రెడ్కో మాజీ చైర్మన్ వై. సతీష్ రెడ్డి పిలుపునిచ్చారు. యూరియా కోసం రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడం దారుణమని ఆయన అన్నారు. రాష్ట్రంలో 10 ఏళ్లపాటు ఎలాంటి ఇబ్బందులు లేకుండా రైతులకు ఎరువులు విత్తనాలు అందాయని గుర్తు చేశారు. రైతులు ఎక్కడ కూడా లైన్ లో నిలబడే అవసరం లేకుండా సకాలంలో సరిపడినన్ని ఎరువులు, విత్తనాలు అందజేసిన ఘనత కేసిఆర్ గారిదని ఆయన అన్నారు. కరోనా సమయంలో కూడా రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఎరువులు సరఫరా చేసిన ఘనత కేసీఆర్ గారిది అన్నారు.
దశాబ్దాలపాటు రాష్ట్రాన్ని పాలించిన కాంగ్రెస్ పార్టీ రైతులను ఇలా లైన్లో నిలబెట్టిన పరిస్థితి చూసి… అధికారంలోకి వచ్చిన కొద్ది రోజుల్లోనే ఆ దుస్థితి నుంచి దూరం చేసిన గొప్ప వ్యక్తి కేసీఆర్ అని అన్నారు. కానీ రాష్ట్రంలో కాంగ్రెస్ మళ్లీ అధికారంలోకి రావడంతో ఆనాటి రోజులు తిరిగి వచ్చాయని… యూరియా కోసం తెల్లవారక ముందే వెళ్లి చెప్పులు, ఆధార్ కార్డులు, పాసుబుక్కులు లైన్లో పెట్టాల్సిన దుస్థితి రేవంత్ రెడ్డి పాలనలో దాపురించిందని ఆయన అన్నారు. ఇదే విషయాన్ని రైతులు కూడా చెబుతున్నారని తెలిపారు. గతంలో రాజశేఖర్ రెడ్డి పాలనలో ఇట్లాంటి తిప్పలు చూసామని ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ పార్టీ పాలన రావడంతో తమకు ఈ దుస్థితి దాపురించిందని రైతులు కూడా దుమ్మెత్తి పోస్తున్న పరిస్థితి కనిపిస్తుందన్నారు. పొద్దంతా లైన్లో నిలబడితే ఒక బస్తా యూరియా ఇస్తున్నారని, మరికొన్ని చోట్ల నానో యూరియా పేరుతో రెండు డబ్బాలు చేతిలో పెట్టి పంపిస్తున్నారని సతీష్ రెడ్డి వివరించారు.
కాంగ్రెస్ అంటేనే రైతు వ్యతిరేకి అని వ్యవసాయాన్ని దండగా చేసే పార్టీ అని మరోసారి స్పష్టమైనది అన్నారు. 10 ఏళ్ల కేసీఆర్ పాలనలో తెలంగాణ రైతులు సుఖ సంతోషాలతో, గుండె నిబ్బరంతో బతికారని ఇప్పుడు తిరిగి వారిని రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఈ దుస్థితికి దిగజార్చిందని ఆయన ఆరోపించారు. రాజులా బతికిన రైతును కూలీ కంటే అద్వానంగా మార్చిన ఘనత కాంగ్రెస్ సర్కారుకే దక్కుతుందని ఆయన అన్నారు.
Also Read:సింగపూర్‌కు ఏపీ సీఎం చంద్రబాబు
రైతులు తమ భూములను సాగు చేసుకోవాల్సిన సమయంలో ఇలా వారిని రోడ్లపై నిలబెట్టి సర్కారు వారి ఉసురు పోసుకుంటోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పుడు లైన్లో ఉన్న చెప్పులన్నీ రేపు పంచాయతీ ఎన్నికల సమయంలో ఓట్ల కోసం వచ్చే కాంగ్రెస్ నాయకులకు చూపియాలని, వారికి ఘన సన్మానం చేసి పంపించాలని పిలుపునిచ్చారు. ఎన్నికల ముందు అలవిగాని హామీలు ఇచ్చి ఎన్నికల తర్వాత ఒక్కటి కూడా సరిగా అమలు చేయకుండా రైతుల ఉసురు పోసుకుంటున్న రేవంత్ రెడ్డికి తగిన బుద్ధి చెప్పాలని ప్రజలని కోరారు.

