బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల కోసం నిర్వహిస్తున్న వర్క్‌షాప్ హైదరాబాద్ సమీపంలోని గండిపేటలో ఉన్న గోల్కొండ రిసార్ట్స్‌లో ప్రారంభమైంది. ఈ వర్క్‌షాప్‌కు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌తో పాటు బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరయ్యారు.
అసెంబ్లీ సమావేశాలు సమీపిస్తున్న నేపథ్యంలో ప్రజాప్రతినిధులు సభలో అనుసరించాల్సిన వ్యూహాలపై ఈ వర్క్‌షాప్‌లో ప్రత్యేకంగా దిశానిర్దేశం చేస్తున్నారు. ముఖ్యంగా సభలో లేవనెత్తాల్సిన ప్రజా సమస్యలు, శాసనసభలో పాటించాల్సిన నియమ నిబంధనలు (రూల్ బుక్), రాజ్యాంగ సంబంధిత అంశాలపై అవగాహన కల్పిస్తున్నారు. ప్రజల సమస్యలను సమర్థవంతంగా సభలో ప్రస్తావించే విధానం, ప్రభుత్వాన్ని ప్రశ్నించే తీరు వంటి అంశాలపై కూడా చర్చలు జరుగుతున్నాయి.
ఈ కార్యక్రమంలో భాగంగా కొద్దిసేపట్లో పలువురు సీనియర్ నేతలు ప్రత్యేక సెషన్లు నిర్వహించనున్నారు. శాసన మండలి వైస్ చైర్మన్ బండా ప్రకాష్, శాసన మండలి ప్రధాన ప్రతిపక్ష నాయకుడు మధుసూదనాచారి అలాగే డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు తదితరులు తమ అనుభవాలను ప్రజాప్రతినిధులతో పంచుకోనున్నారు.
Also Read:మైత్రీ మూవీ మేకర్స్.. ‘జెట్లీ’ షూటింగ్ పూర్తి
వర్క్‌షాప్ చివరి సెషన్‌లో కేటీఆర్ మాట్లాడనున్నారు. పార్టీ శాసనసభ్యులు భవిష్యత్ రాజకీయ వ్యూహాలు, అసెంబ్లీ సమావేశాల్లో పార్టీ వైఖరి వంటి అంశాలపై ఆయన మార్గనిర్దేశం చేయనున్నట్లు సమాచారం. ఈ వర్క్‌షాప్ ద్వారా పార్టీ ప్రజాప్రతినిధులు మరింత సమన్వయంతో పని చేసేలా చేయడం లక్ష్యంగా బీఆర్ఎస్ నేతలు చెబుతున్నారు.

