దేశ రాజకీయాలను ఏలుతున్న బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు చరమగీతం పాడేందుకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి ఆరంగేట్రం చేసిన సంగతి తెలిసిందే. తెలంగాణ వరకే పరిమితం అయిన టీఆర్‌ఎస్ ను జాతీయ స్థాయిలో తీసుకెళ్ళేందుకు బీఆర్‌ఎస్ గా పేరు మార్చిన సంగతి కూడా విధితమే. ఇక పూర్తి స్థాయిలో నేటి ( డిసెంబర్ 9 ) నుంచి టిఆర్‌ఎస్ బిఆర్‌ఎస్ రూపాంతరం చెందింది. అయితే బిఆర్‌ఎస్ ప్రభావం దేశ రాజకీయాల్లో ఎలా ఉండబోతుంది ? కేసిఆర్ ఎంట్రీతో దేశ రాజకీయాల్లో చోటు చేసుకునే పరిణామాలెంటి ? అసలు బిఆర్‌ఎస్ పై ప్రస్తుతం ఎందుకంత చర్చ జరుగుతోంది ? అనే విషయాలపై ఓ లుక్కేద్దాం . ప్రస్తుతం దేశంలో బీజేపీ కాంగ్రెస్ పార్టీలు మాత్రమే జాతీయ పార్టీలుగా వెలుగొందుతున్నాయి.
దేశ రాజకీయాలను శాసించడంలో ఈ రెండు పార్టీలదే కీలక పాత్ర. కేంద్రంలో అధికారం చేపట్టాలంటే బీజేపీ, కాంగ్రెస్ తప్పా ప్రజలు వేరే ప్రత్యామ్నాయం లేదు. ఈ విధానాన్ని మార్చేందుకు గతంలో చాంద్రబాబు నాయుడు, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ.. వంటి వాళ్ళు జాతీయ రాజకీయాలపై దృష్టి సారించారు కానీ పూర్తి స్థాయిలో రాణించలేక వెనుదిరిగారు. దీనికి కారణం ప్రాంతీయ భావాలు దేశ ప్రజలను ప్రభావితం చేయలేకపోవడమే అని చెప్పక తప్పదు. ఇదిలా ఉంచితే 2014 లో కాంగ్రెస్ పరిపాలనపై విరక్తి చెందిన ప్రజలు బీజేపీ నాయకత్వంపై మొగ్గు చూపి కాషాయ పార్టీకి పట్టం కట్టారు. దాంతో 2014 నుంచి ఇప్పటివరకు దేశంలో బీజేపీ పాలననే నడుస్తోంది.
అయితే మోది పాలనపై దేశ ప్రజల్లో ఎంత వ్యతిరేకత ఉన్నప్పటికి.. ప్రజలకు వేరే ప్రత్యామ్నాయం లేదు. ఎందుకంటే కాంగ్రెస్ పాలన వద్దనే బీజేపీకి అధికారం కట్టబెట్టిన ప్రజలు మళ్ళీ కాంగ్రెస్ వైపు చూసే పరిస్థితి లేదు. ఇక బీజేపీ పై వ్యతిరేకత ఉన్నప్పటికి ప్రజలకు మరో ఆప్షన్ లేదు. ఈ నేపథ్యంలో తెలంగాణ మోడల్ ను జాతీయ స్థాయిలో విస్తరించేందుకు కేసిఆర్ జాతీయ రాజకీయాల్లోకి ఆరంగేట్రం చేశారు. కేసిఆర్ పరిపాలన విధానంపై దేశ ప్రజల్లో మొదటి నుంచి కూడా సానుకూలత ఉంది. తెలంగాణలో కేసిఆర్ సర్కార్ ప్రవేశ పెట్టిన రైతు బంధు, దళిత బంధు, ఉచిత కరెంట్ వంటి ఎన్నో పథకాలకు జాతీయ స్థాయిలో మంచి గుర్తింపు ఉంది.
అంతే కాకుండా ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలు కూడా తెలంగాణ పథకాలను పేర్లు మార్చి వారి రాష్ట్రంలో అమలు చేస్తున్నసందర్భాలు కూడా ఉన్నాయి. దాంతో కేసిఆర్ జాతీయ రాజకీయాల్లోకి రానున్నాడనే వార్తా బయటకు రాగానే దేశ ప్రజల్లో క్యూరియాసిటీ గట్టిగానే ఏర్పడింది. అందుకు తగ్గట్టుగానే జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన నాయకులు కుమారస్వామి, బిహార్ ముఖ్యమంతి నితీష్ కుమార్ వంటి జాతీయ నేతలు కేసిఆర్ కు భారీగా మద్దతు ప్రకటించారు. ఇక ముందు రోజుల్లో బిఆర్‌ఎస్ కు దేశ వ్యాప్తంగా మరింత మద్దతు పెరగడం ఖాయం. ఈ నేపథ్యంలో బీజేపీ, కాంగ్రెస్ వంటి జాతీయ పార్టీలకు ప్రత్యామ్నాయంగా బిఆర్‌ఎస్ నిలిచే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. మరి కేసీఆర్ తదుపరి తీసుకునే ప్రతి నిర్ణయం కూడా దేశ రాజకీయాలను ప్రభావితం చేసే విధంగా ఉండనున్నాయనడంలో ఎలాంటి సందేహం లేదు.
ఇవి కూడా చదవండి…