జాతీయ రాజకీయాల్లో శరవేగంగా మార్పులు చోటుచేసుకున్నాయి. ఓ వైపు ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటులో భాగంగా ప్రాంతీయ పార్టీలను ఏకతాటిపైకి తెస్తున్న కేసీఆర్ మరోవైపు ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కీలకంగా ఉండేలా వ్యూహరచన చేస్తున్నారు.
ప్రస్తుతం ఉన్న ట్రెండ్స్ ప్రకారం బీజేపీ అధికారంలోకి వచ్చే అవకాశం లేకపోవడంతో యూపీఏ వైపు తన దృష్టి మరల్చారు. జాతీయ స్థాయిలో కాంగ్రెసు కూటమితో కలిసేందుకు ఆసక్తి చూపిస్తున్నట్లు తెలుస్తోంది. కాంగ్రెసేతర, బిజెపియేతర కూటమి కోసం ప్రయత్నాలు సాగించినప్పటికి అది సాధ్యమయ్యే పరిస్థితి లేకపోవడంతో యూపీఏ వైపు మొగ్గు చూపినట్లు తెలుస్తోంది. ఇందుకోసం కర్నాటక సీఎం కుమారస్వామితో మధ్యవర్తిత్వం జరుపుతున్నట్లు కన్నడ పత్రికలు కథనాలను ప్రచురించాయి.
ఈ నేపథ్యంలో కొన్నిరోజులుగా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు వరుసగా టీఆర్ఎస్‌లో చేరుతుండటంతో టీఆర్ఎస్ ఎల్పీలో కాంగ్రెస్ ఎల్పీ విలీనం లాంఛనమే అనే ప్రచారం జరిగింది. అయితే మారుతున్న పరిస్థితులకు అనుగణంగా సిఎల్పీని తమ పార్టీలో విలీనం చేసుకుంటే జాతీయ స్థాయి రాజకీయాలకు విఘాతం ఏర్పడవచ్చని భావిస్తున్న కేసీఆర్ విలీనం ప్రక్రియకు బ్రేక్ వేసినట్లు తెలుస్తోంది. మొత్తంగా సార్వత్రిక ఎన్నికల ఫలితాల వెల్లడికి ఇంకా 13 రోజులు మాత్రమే సమయం ఉండటంతో పొలిటికల్ వాతావరణం ఒక్కసారిగా హీటెక్కింది.