భారత్‌లో తొలి ఏఐ సిటీకి బ్రేక్!

1
- Advertisement -

భారతదేశంలోనే తొలి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఆధారిత నగరంగా రూపుదిద్దుకోనున్న కర్ణాటకలోని గ్రేటర్ బెంగళూరు ఇంటిగ్రేటెడ్ టౌన్‌షిప్ (GBIT) ప్రాజెక్ట్‌కు రైతుల నిరసనలు అడ్డంకిగా మారాయి. బెంగళూరుకు సుమారు 40 కిలోమీటర్ల దూరంలోని బిదది–హారోహళ్లి ప్రాంతాల్లో ఈ ప్రతిష్ఠాత్మక ప్రాజెక్ట్‌ను అభివృద్ధి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నప్పటికీ, వ్యవసాయ భూముల స్వాధీనం అంశంపై రైతులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. దీంతో ఈ ప్రాజెక్ట్ రాజకీయంగానూ చర్చనీయాంశంగా మారింది.

దాదాపు 9,600 ఎకరాల విస్తీర్ణంలో ఈ టౌన్‌షిప్‌ను నిర్మించేందుకు ప్రణాళికలు సిద్ధమయ్యాయి. కృత్రిమ మేధ (AI) సాంకేతికతతో నగర పాలన, ట్రాఫిక్ నిర్వహణ, ప్రజా సేవలు, మౌలిక సదుపాయాల నిర్వహణను మరింత సమర్థవంతంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ప్రభుత్వం చెబుతోంది.ఈ ప్రాజెక్టులో ఏఐ ఆధారిత నివాస, పారిశ్రామిక ప్రాంతాలు, స్మార్ట్ రోడ్లు, ట్రాఫిక్ రహిత మొబిలిటీ కారిడార్లు, అత్యాధునిక పాఠశాలలు, ఆస్పత్రులు, డిజిటల్ పౌర సేవలు, స్థానికులకు ఉపాధి అవకాశాలు వంటి సదుపాయాలను ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. బెంగళూరులో పెరుగుతున్న జనాభా ఒత్తిడిని తగ్గించడంలో ఈ కొత్త నగరం కీలక పాత్ర పోషిస్తుందని ప్రభుత్వం భావిస్తోంది.

ఈ టౌన్‌షిప్ ఆలోచన కొత్తది కాదు. 2006లో అప్పటి ముఖ్యమంత్రి హెచ్.డి. కుమారస్వామి ప్రభుత్వం దీనిని ప్రతిపాదించింది. అయితే 2008-09 ఆర్థిక మాంద్యం కారణంగా ప్రాజెక్ట్ ముందుకు సాగలేదు. 2023లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ప్రణాళికను మళ్లీ పునరుద్ధరించింది. 2025లో భూసేకరణకు సంబంధించిన ప్రాథమిక నోటిఫికేషన్ జారీ చేయగా, ప్రస్తుతం తదుపరి ప్రక్రియ కొనసాగుతోంది.

ఈ ప్రాజెక్టు కోసం సారవంతమైన వ్యవసాయ భూములను స్వాధీనం చేసుకోవడం రైతుల ప్రధాన అభ్యంతరంగా ఉంది. తరతరాలుగా సాగు చేస్తున్న భూములను కోల్పోతే జీవనాధారం దెబ్బతింటుందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమ అభిప్రాయాలను ప్రభుత్వం సరిగా పరిగణనలోకి తీసుకోలేదని, అభివృద్ధి పేరుతో రైతుల ప్రయోజనాలను విస్మరిస్తోందని ఆరోపిస్తున్నారు.

తాజా భూసేకరణ నోటిఫికేషన్ ప్రకారం సుమారు 499 ఎకరాల భూమిను స్వాధీనం చేసుకోనున్నారు. ఈ ప్రక్రియతో ప్రభావితమయ్యే గ్రామాలు…భైరమంగళ,బన్నిగిరి,
హోసూర్,వడేరహళ్లి,కంచుగారనహళ్లి,కెంపయ్యనపాళ్య,కేజీ గొల్లరపాళ్య,మండలహళ్లి,అరలాలుసంద్ర.

రైతుల అంగీకారం, భూసేకరణ, పునరావాసం, పరిహారం వంటి అంశాలపై ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలపై ఈ ప్రతిష్ఠాత్మక ఏఐ సిటీ భవిష్యత్తు ఆధారపడి ఉంది. ఒకవైపు సాంకేతిక ఆధారిత ఆధునిక నగర నిర్మాణం అవసరమని ప్రభుత్వం చెబుతుండగా, మరోవైపు వ్యవసాయ భూములను కాపాడాలని రైతులు పట్టుదలగా నిలుస్తున్నారు. దీంతో దేశంలోని తొలి ఏఐ నగరంగా ప్రచారం పొందిన బిదది టౌన్‌షిప్ ప్రాజెక్ట్ ప్రస్తుతం తీవ్ర అనిశ్చితిని ఎదుర్కొంటోంది.

- Advertisement -