ప్రపంచవ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ శరవేగంగా సాగుతోంది. అయితే ఓ వైపు వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతుండగా మరోవైపు కేసుల సంఖ్య కూడా స్వల్పంగా పెరుగుతూ వస్తోంది. టీకా వచ్చిన కొత్త తరహా కరోనా వేరియంట్‌లు బయటపడుతుండటం అందరికి ఆందోళన కలిగిస్తోంది. బ్రెజిల్‌లోని అమెజాన్ రెయిన్ ఫారెస్ట్‌లో ఉద్భవించిన పీ1 అనే కొత్త వేరియంట్ కూడా తాజా ముప్పునకు కారణమని నిపుణులు అంటున్నారు. ఆ దేశంలో మొత్తం 27 రాష్ట్రాలుండగా.. 17 రాష్ట్రాల్లో ఈ రకం కరోనా తన ఉనికిని చాటుతోంది. అలాగే 10కి పైగా దేశాలకు కూడా విస్తరించింది.
ఇప్పటికే బ్రెజిల్‌లోని 19 రాష్ట్రాల్లో ఐసీయూలు 80 శాతానికి పైగా వినియోగంలో ఉన్నాయని ఫియోక్రజ్ చెప్పింది. ఆసుపత్రులు కిక్కిరిసిపోయి ఉండటంతో, రోగులను పొరుగు ప్రాంతాలకు పంపించాల్సిన దుస్థితి నెలకొంది. మిగతా దేశాలతో పోల్చుకుంటే బ్రెజిల్ లో వ్యాక్సినేషన్ కార్యక్రమం కాస్త ఆలస్యంగా ప్రారంభమైంది. అదీకాక టీకాల కొరత వేధిస్తోంది.
మొదటి నుంచి కూడా కరోనాను నియంత్రించే విషయంలో బ్రెజిల్ ఇబ్బందులు ఎదుర్కొంటోంది. వైరస్‌ను నిర్లక్ష్యం చేసి, నిపుణుల సూచనలు ఖాతరు చేయకపోవడంతో ఆ దేశ అధ్యక్షుడు జెయిర్ బొల్సొనారో తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నారు. సెలవులు, కార్నివాల్స్ తో ఇప్పుడు అక్కడ కరోనా ఉద్ధృతికి కారణమయ్యాయి.