స్క్రీన్‌పై బ్రహ్మానందం.. కనబడితే చాలు సినిమాకొచ్చిన ప్రేక్షకులు పొట్ట చెక్కలయ్యేలా నవ్వులతో ఊగిపోవడం ఖాయం. అసలు బ్రహ్మానందం కోసమే కొంత మంది ప్రేక్షకులు సినిమా ధియేటర్‌లోకి అడుపెడతారంటే..ఖచ్చితంగా నమ్మాల్సిందే. అలాంటి బ్రహ్మానందం ఈ మధ్య ప్రేక్షకుల కంటికి కనిపించడం కష్టంగానే మారింది. నిజానికి ఈ నవ్వుల బాద్‌షాకి ఇప్పుడున్న పరిస్థితుల్లో గిరాకీ తగ్గిపోయింది. ఒకప్పుడు బ్రహ్మనందం లేకుండా సినిమా లేదంటే అతిశయోక్తి కాదు. ఆయన ప్రధాన పాత్రలోను కొన్ని సినిమాలు వచ్చాయి. ఇప్పుడు మరోసారి అలాంటి ప్రయోగమే చేయబోతున్నారు నిర్మాతలు. పూర్తి కామెడీ ఎంటర్ టైనర్ గా కత్తి రెడ్డి అనే టైటిల్ తో ఓ సినిమా ప్లాన్ చేశారు.
టైటిల్ చెప్పగానే ఇది సమర సింహారెడ్డి.. ఇంద్ర సేనా రెడ్డి.. ఆది లాంటి సినిమాలకు స్పూఫ్ లతో నింపేయచ్చే డౌట్ వస్తే మాత్రం.. అది తెలుగు సినిమా మేకర్స్ కామెడీపై జనాలకు ఏర్పడ్డ అభిప్రాయం అంతే. దీనికి ట్యాగ్ లైన్ ఎత్తితే.. దించడు. వి రవివర్మ దర్శకత్వంలో రూపొందనున్న ఈ చిత్రంలో రచ్చ రవి కీ రోల్ పోషించనున్నాడట. ఈ సినిమాకి సంబంధించి పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడిస్తారని తెలుస్తుండగా, కత్తి రెడ్డిగా బ్రహ్మానందం ఎలా కామెడి చేసి మెప్పిస్తాడో చూడాలంటే కొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.