‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’తో మళ్లీ టాలీవుడ్‌లో మల్టీస్టారర్ ట్రెండు మొదలైంది. దాని తర్వాత ఇప్పుడు రామ్ చరణ్-జూనియర్ ఎన్టీఆర్ కాంబినేషన్లో రాజమౌళి తీయబోయే మల్టీస్టారర్ టాలీవుడ్లో పెద్ద చర్చనీయాంశం అయింది. ఇప్పుడు అలాంటి మరో భారీ కాంబినేషన్లో సినిమాకు రంగం సిద్ధమవుతున్నట్లుగా సిని వర్గాల సమాచారం.
అయితే సూపర్ స్టార్ మహేష్ బాబు.. నందమూరి బాలకృష్ణ కాంబినేషన్‌లో మల్టీస్టారర్ చేయడానికి బోయపాటి శ్రీను సన్నాహాలు చేస్తున్నారట. అతను ఇప్పటికే వీళ్లిద్దరికీ స్టోరీ లైన్ కూడా చెప్పాడట. ఇద్దరూ సానుకూలంగానే స్పందించినట్లు సమాచారం. కాకపోతే ఫైనల్ స్క్రిప్టు విన్నాక తుది నిర్ణయం తీసుకుంటామని చెప్పినట్లు సమాచారం. బాలయ్యకు బోయపాటి మీద ఎంత గురో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. వరుస ఫ్లాపుల్లో కొట్టుమిట్టాడుతున్న బాలయ్యను మళ్లీ హిట్ ట్రాక్ ఎక్కించింది బోయపాటే.
మహేష్.. బోయపాటితో ఇప్పటిదాకా పని చేయలేదు కానీ.. అతడి దర్శకత్వంలో సినిమా చేయడానికి మాత్రం అంగీకరించాడు. ఐతే ఇది మల్టీస్టారర్ అని అతను అనుకోలేదు. ఐతే బోయపాటి మాత్రం బాలయ్య కాంబోలో ఈ సినిమా చేద్దామని భావిస్తున్నాడు. మహేష్.. బాలయ్య.. ఇద్దరికీ సన్నిహితులైన ‘14 రీల్స్’ వాళ్లు ఈ సినిమాను ప్రొడ్యూస్ చేయడానికి తహతహలాడుతున్నారు. మరి నిజంగా ఈ కాంబినేషన్ ఓకే అయిందంటే.. సెన్సేషన్ క్రియేట్ చేయడం ఖాయం.