ఒక రాజకీయ కార్యకర్తపై ముంబై పోలీసులు జారీ చేసిన నగర బహిష్కరణ ఉత్తర్వులను బాంబే హైకోర్టు కొట్టివేసింది. కేంద్రంలోని బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వ నిర్ణయాలకు వ్యతిరేకంగా నిరసనను నిర్వహించడం మాత్రమే ఒక వ్యక్తి యొక్క ప్రాథమిక హక్కులను దెబ్బతీసేలా బహిష్కరించడానికి కారణం కాబోదని హైకోర్టు స్పష్టం చేసింది.
తాను సోషలిస్ట్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా (SDPI) జనరల్ సెక్రటరీనని…తనను ఏడాది పాటు బహిష్కరించారని పేర్కొంటూ 49 ఏళ్ల సయీద్ అహ్మద్ అబ్దుల్ వాహీద్ చౌదరి దాఖలు చేసిన పిటిషన్‌ను విచారించిన బాంబే హైకోర్టు ఏకసభ్య ధర్మాసనం జస్టిస్ మాధవ్ జె. జమ్దార్ పోలీసులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ నిర్ణయాలను వ్యతిరేకించినందుకు కేసులు పెట్టి పౌరులను ప్రభుత్వ బానిసలుగా” మారుస్తున్నారా?, వారు నిరసనలు ఎందుకు తెలపకూడదు? అని పోలీసులను ప్రశ్నించారు.
పిటిషనర్ గతంలో చేపట్టిన నిరసనలలో ‘బీజేపీ ప్రభుత్వం ముర్దాబాద్’, ‘అమిత్ షా ముర్దాబాద్’ వంటి నినాదాలు చేశారనే కారణంతో నమోదైన ఎఫ్‌ఐఆర్ (FIR)ల ఆధారంగా ముంబై పోలీసులు బహిష్కరణ ఉత్తర్వులు ఎలా జారీ చేస్తారని జస్టిస్ జమ్దార్ తెలుసుకోవాలని కోరారు. ఇటీవలి పరీక్షల పేపర్ లీక్ కేసు మరియు పిటిషనర్ వాదనలను ప్రస్తావిస్తూ… పౌరులు నిరసనలు తెలపడానికి లేదా నినాదాలు చేయడానికి ఎందుకు అర్హులు కారని ఆయన ప్రశ్నించారు.
నిరసన తెలపడం అనేది పౌరుల హక్కు. పిటిషనర్ కేవలం ‘బీజేపీ ప్రభుత్వం ముర్దాబాద్’, ‘అమిత్ షా ముర్దాబాద్’ వంటి నినాదాలు మాత్రమే చేశారు… పౌరులు అలాంటి నినాదాలు ఎందుకు చేయకూడదు? మరియు అటువంటి నినాదాల కోసం బహిష్కరణ ఉత్తర్వులు ఎలా ఇస్తారు? అని జస్టిస్ జమ్దార్ అన్నారు.పోలీసులను హెచ్చరిస్తూ… వారు ప్రజల సేవకులని, ప్రభుత్వ అగ్రనేతల సేవకులు కాదని ఆయన గుర్తుచేశారు.
అయితే, జస్టిస్ జమ్దార్ తన తీర్పులో ముంబై పోలీసుల చర్యను “దురుద్దేశపూరితం” (mala fide) గా అభివర్ణించారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 19 మరియు 21 ప్రకారం “పౌరులకు తమ అభిప్రాయాలను వ్యక్తం చేసే స్వేచ్ఛ” మరియు “గౌరవంగా జీవించే హక్కు” ఉన్నాయని పేర్కొన్నారు. పిటిషనర్ వల్ల సమాజానికి లేదా ఆస్తులకు ముప్పు వాటిల్లుతోందని చూపించడానికి రికార్డుల్లో ఎలాంటి ఆధారాలు లేవని న్యాయమూర్తి గమనించారు.
పిటిషనర్‌పై ఉన్న ఆరోపణలు ఐపీసీ సెక్షన్ 188 కింద గరిష్టంగా ఒక నెల జైలు శిక్ష విధించదగిన నేరాలని, అయితే మహారాష్ట్ర పోలీస్ యాక్ట్ నిబంధనల ప్రకారం బహిష్కరణ ఉత్తర్వులు జారీ చేయడానికి అది కారణం కాబోదని కోర్టు స్పష్టం చేసింది.
Also Read:EPFO సంచలన నిర్ణయం
“బహిష్కరణ ఉత్తర్వు అనేది ఒక అసాధారణమైన చర్య. ఇటువంటి ఉత్తర్వు వల్ల ఒక పౌరుడికి భారతదేశం అంతటా స్వేచ్ఛగా తిరిగే ప్రాథమిక హక్కును హరించినట్లవుతుంది” అని జస్టిస్ జమ్దార్ పేర్కొన్నారు. గతానేక సుప్రీంకోర్టు, హైకోర్టుల తీర్పులను ఉటంకిస్తూ… కేవలం భారత ప్రభుత్వ నిర్ణయాలను వ్యతిరేకించినందుకు మహారాష్ట్ర ప్రభుత్వం పిటిషనర్‌ను బహిష్కరించడం అనేది అతని భావప్రకటన స్వేచ్ఛను మరియు గౌరవంగా జీవించే హక్కును దెబ్బతీస్తుందని పేర్కొంటూ కోర్టు ఆ బహిష్కరణను కొట్టివేసింది.

