సౌదీ అరేబియా నుంచి హైదరాబాద్ శంషాబాద్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి వచ్చిన ఎయిర్‌బోర్న్ ప్లైనాస్ 325 విమానానికి బాంబు బెదిరింపు రావడం కలకలం రేపింది. విమానంలో ఐదు ఆర్‌డీఎక్స్ (RDX) బాంబులు అమర్చినట్లు పేర్కొంటూ గుర్తు తెలియని వ్యక్తి ఎయిర్‌పోర్ట్ అధికారులకు ఈమెయిల్ పంపినట్టు సమాచారం. విమానం ఏ క్షణమైనా పేలిపోయే ప్రమాదం ఉందని, వెంటనే ప్రయాణికులను సురక్షితంగా దింపాలని ఆ మెయిల్‌లో హెచ్చరించినట్లు అధికారులు తెలిపారు.
బెదిరింపు మెయిల్ అందగానే ఎయిర్‌పోర్ట్ సెక్యూరిటీ అధికారులు హై అలర్ట్ ప్రకటించారు. విమానం ల్యాండ్ అయిన వెంటనే ఐసోలేషన్ బేకు తరలించి, ప్రయాణికులు మరియు సిబ్బందిని సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు. అనంతరం బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్, సీఐఎస్‌ఎఫ్, స్థానిక పోలీసులు కలిసి విమానంలో పూర్తిస్థాయి తనిఖీలు చేపట్టారు. లగేజీ, కార్గో, కాక్‌పిట్ సహా విమానం మొత్తం క్షుణ్ణంగా పరిశీలించారు.
ప్రాథమిక తనిఖీల్లో ఎలాంటి పేలుడు పదార్థాలు లభించలేదని అధికారులు తెలిపారు. అయితే భద్రతాపరమైన చర్యల దృష్ట్యా మరింత లోతైన తనిఖీలు కొనసాగుతున్నాయని చెప్పారు. ఈ ఘటనతో కొంతసేపు విమానాశ్రయంలో ఉద్రిక్తత నెలకొనగా, ప్రయాణికులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. బెదిరింపు మెయిల్ పంపిన వ్యక్తిని గుర్తించి పట్టుకునేందుకు దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు వెల్లడించారు.
Also Read:హైలెస్సో..వడ్డీ కాంతమ్మగా అక్షర

