ఢిల్లీలో పేలుడు.. దేశవ్యాప్తంగా హైఅలర్ట్‌..

213
Bomb blast in Delhi
- Advertisement -

ఢిల్లీలోని ఇజ్రాయెల్ దౌత్య కార్యాలయం ఎదుట పేలుడు సంభవించింది. ఈ పేలుడు శుక్రవారం సాయంత్రం సంభవించినట్టు ఢిల్లీ పోలీసులు వెల్లడించారు. ఎంబసీ భవనం ఉన్న పేవ్ మెంట్ పై ఈ పేలుడు సంభవించిందని చెప్పారు. ఈ పేలుడు కారణంగా అక్కడ పార్క్ చేసున్న నాలుగు కార్ల అద్దాలు బద్దలయ్యాయి. అయితే ఈ పేలుడులో ఎవరూ గాయపడలేదని తెలుస్తోంది. పేలుడు సంభవించిన వెంటనే ఆ ప్రాంతంలో భారీ ఎత్తున పోలీసులు మోహరించారు.

ఘటనాస్థలిలో రసాయనాలతో కూడిన సీసాను స్వాధీనం చేసుకున్నారు. ఢిల్లీ స్పెషల్‌ సెల్‌, ఎన్‌ఐఏ, ఇంటెలిజెన్స్‌, ఫోరెన్సిక్‌ అధికారులు సంఘ‌ట‌నాస్థ‌లంలో ఆధారాలు సేకరిస్తున్నారు. ఇజ్రాయిల్‌ ఎంబసీ, అబ్దుల్‌ కలాం మార్గంలో సీసీటీటీ ఫుటేజీని పరిశీలిస్తున్నారు. పేలుడు దృష్ట్యా సీఐఎస్‌ఎఫ్ దేశవ్యాప్తంగా ‌హెచ్చరికలు జారీ చేసింది. అన్ని ముఖ్య ప్రాంతాల్లో అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. పేలుడు సంభవించిన ప్రాంతం రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్, ప్రధాని నరేంద్ర మోదీ, ఇతర ప్రముఖులు పాల్గొంటున్న ‘బీటింగ్ ది రిట్రీట్ సెరమొనీ’ జరుగుతున్న ప్రాంతానికి కేవలం 2 కిలోమీటర్ల దూరంలో ఉంది. పేలుడు నేపథ్యంలో ఒక్కసారిగా అలజడి చెలరేగింది.

ఢిల్లీ పేలుడు ఘటనపై కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా ఆరా తీశారు. ఘటనపై ఢిల్లీ సీపీ, ఇంటెలిజెన్స్‌ చీఫ్‌ను అడిగి తెలుసుకున్నారు. మ‌రోవైపు ఇజ్రాయిల్‌ విదేశాంగ మంత్రితో కేంద్ర విదేశాంగ‌శాఖ మంత్రి జైశంక‌ర్‌ ఫోన్‌లో మాట్లాడారు. పేలుడు ఘటనను తీవ్రంగా పరిగణిస్తున్నట్లు తెలిపారు. ఇజ్రాయిల్‌ ఎంబసీకి పూర్తి భద్రత కల్పిస్తున్నట్లు చెప్పారు. పేలుడు ఘటనపై దర్యాప్తు కొనసాగుతుందని.. నిందితులను ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టేదిలేద‌ని జైశంక‌ర్ వెల్లడించారు.

- Advertisement -