ధాన్యం సేకరణ తక్షణమే చేపట్టాలి..

199

జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలం తాండ్రియాల్ గ్రామంలో ధాన్యం సేకరణ ప్రక్రియను తక్షణమే చేపట్టాలని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ పౌర సరఫరాల సంస్థ కమిషనర్, జగిత్యాల జిల్లా కలెక్టర్ లకు సూచించారు. జగిత్యాల జిల్లా పర్యటనలో భాగంగా తాండ్రియాల్ గ్రామానికి చేరుకున్న ఆయనతో గ్రామస్తులు మాట్లాడుతూ.. తమ గ్రామంలో ధాన్యం సేకరణ జరగడం లేదని తెలిపారు. వర్షాలు కురుస్తున్నాయి.. ధాన్యం తడిసిపోయే ప్రమాదం ఉందని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేశారు. వెంటనే స్పందించి వినోద్‌ కుమార్‌ పౌర సరఫరాల సంస్థ కమిషనర్, జిల్లా కలెక్టర్ లతో ఫోన్‌లో మాట్లాడారు. తాండ్రియాల్ గ్రామంలోని 15 వేల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని వెంటనే సేకరించి జగిత్యాల జిల్లా గోడౌన్ లలో స్థలం లేకుంటే పెద్దపల్లి జిల్లా గోడౌన్ లకు తరలించాలని సూచించారు.