అమెరికాలో మంచు తుపాను బీభత్సం

3
- Advertisement -

అమెరికాను తీవ్రంగా అతలాకుతలం చేస్తున్న భారీ మంచు తుపాను కారణంగా పరిస్థితి అత్యంత ప్రమాదకరంగా మారింది. గడ్డకట్టే చలితో దేశవ్యాప్తంగా సుమారు 15 కోట్ల మంది ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఉష్ణోగ్రతలు హిమాంకం కంటే చాలా దిగువకు పడిపోవడంతో సాధారణ జీవనం పూర్తిగా స్థంభించింది. ఈ తీవ్ర వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో దాదాపు 15 రాష్ట్రాల్లో అత్యవసర పరిస్థితి (ఎమర్జెన్సీ)ని అధికారులు ప్రకటించారు.

భారీ మంచు వర్షం, బలమైన గాలుల కారణంగా రోడ్డు రవాణా తీవ్రంగా ప్రభావితమైంది. ముఖ్యంగా విమాన ప్రయాణాలు పూర్తిగా గందరగోళంగా మారాయి. మంచు పేరుకుపోవడంతో 1,800కు పైగా విమానాలను రద్దు చేయాల్సి వచ్చింది. అనేక విమానాశ్రయాల్లో రన్‌వేలు మంచుతో కప్పుకుపోవడంతో ప్రయాణికులు గంటల తరబడి ఎదురుచూడాల్సిన పరిస్థితి ఏర్పడింది.

ఇక విద్యుత్ సరఫరాపై కూడా ఈ మంచు తుపాను ప్రభావం చూపే అవకాశం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు. భారీ మంచు, గాలుల వల్ల విద్యుత్ లైన్లు తెగిపోయే ప్రమాదం ఉందని తెలిపారు. ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో విద్యుత్ అంతరాయాలు మొదలయ్యాయి.

ఈ పరిస్థితుల నేపథ్యంలో సోమవారం వరకు పరిస్థితి తీవ్రంగానే కొనసాగుతుందని వాతావరణ శాఖ అంచనా వేసింది. అత్యవసరమైతే తప్ప ప్రజలు బయటకు రావొద్దని వైట్‌హౌస్ సూచించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ప్రభుత్వ సూచనలు తప్పకుండా పాటించాలని అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు.

Also Read:వాహనాలు షోరూమ్‌ల వద్దే రిజిస్ట్రేషన్

- Advertisement -