TTD:కల్తీ నెయ్యి..ఛార్జిషీట్ దాఖలు

7
- Advertisement -

తిరుమల తిరుపతి దేవస్థానాల్లో (టీటీడీ) జరిగిన కల్తీ నెయ్యి కుంభకోణంపై సిట్ కోర్టులో కీలక ఛార్జిషీట్ దాఖలు చేసింది. దాదాపు 600 పేజీలతో సిద్ధం చేసిన ఈ ఛార్జిషీట్‌లో సంచలన విషయాలు వెలుగుచూశాయి. 2019 నుంచి 2024 మధ్య టీటీడీలో సుమారు 60 లక్షల కిలోల కల్తీ నెయ్యి సరఫరా జరిగినట్లు సిట్ నిర్ధారించింది. ఈ కల్తీ నెయ్యితో దాదాపు 20.1 కోట్ల శ్రీవారి లడ్డూలతో పాటు ఇతర ప్రసాదాలను తయారు చేసినట్లు పేర్కొంది.

నెయ్యి పేరుతో పామాయిల్, పామ్ కర్నెల్ ఆయిల్ వంటి నాణ్యతలేని పదార్థాలను వినియోగించారని, నెయ్యి వాసన కోసం బీటా కెరోటిన్ వంటి రసాయనాలను కలిపినట్లు ఛార్జిషీట్‌లో వెల్లడైంది. ఈ అక్రమాల వల్ల టీటీడీకి మొత్తం రూ.235 కోట్ల నిధుల దుర్వినియోగం జరిగిందని సిట్ అంచనా వేసింది.

ఈ వ్యవహారంలో టీటీడీ ఉద్యోగులు, అధికారులు, డైరీ సంస్థలు పరస్పరం కుమ్మక్కైనట్లు దర్యాప్తులో తేలింది. మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి హయాంలో టెండర్ నిబంధనల్లో మార్పులు చేసి, పాలు సేకరణ, వెన్న, నెయ్యి ఉత్పత్తి అర్హతలను తొలగించినట్లు పేర్కొన్నారు. భద్రతా డిపాజిట్‌ను రూ.250 కోట్ల నుంచి రూ.150 కోట్లకు తగ్గించారని వెల్లడించారు.

Also Read:వాహనాలు షోరూమ్‌ల వద్దే రిజిస్ట్రేషన్

మాజీ టీటీడీ చైర్మన్ పీఏ చిన్నప్పన్న కిలోకు రూ.25 చొప్పున లంచం డిమాండ్ చేశారన్న ఆరోపణలు ఉన్నాయి. 2019–24 మధ్య ఆయన ఖాతాల్లో రూ.4.69 కోట్లు జమ కాగా, అందులో రూ.4.64 కోట్లు ఇతర ఖాతాలకు మళ్లించినట్లు సిట్ గుర్తించింది. ఏఆర్ డైరీ, వైష్ణవి డైరీ, బోలో బాబా ఆర్గానిక్ తదితర సంస్థల ప్రమేయం ఉందని, మొత్తం 36 మంది నిందితుల్లో 12 మంది టీటీడీ ఉద్యోగులున్నారని ఛార్జిషీట్‌లో పేర్కొన్నారు. 14 నెలల పాటు సాగిన దర్యాప్తులో 12 రాష్ట్రాల్లో సోదాలు నిర్వహించారు.

- Advertisement -