బీజేపీది దొడ్డి దారే: హరీశ్‌ రావు

26
harish
- Advertisement -

బీజేపీ పార్టీ ఎనిమిది రాష్ట్రాల్లో ప్ర‌జాస్వామ్యంగా ఎన్నికైన ప్ర‌భుత్వాల‌ను ప‌డ‌గొట్టి దొడ్డి దారిన అధికారం చేజిక్కించుకున్న‌ద‌ని మంత్రి హరీశ్‌ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశంలో బీజేపీ పాల‌న‌ను ప‌క్క‌కు పెట్టి… ప్ర‌తిప‌క్షాల‌నే టార్గెట్ చేస్తుందన్నారు. ఎంఎన్‌జే క్యాన్సర్ ద‌వాఖాన‌లో ఎంఓటీ, మోడ్రన్ కిచెన్, దోబీఘాట్ల‌ను ప్రారంభించిన అనంతరం ఆయ‌న మాట్లాడారు. మహారాష్ట్ర, బీహార్, ఢిల్లీతోపాటు నిన్న జార్ఖండ్‌లో బీజేపీ చేసిన నిర్వాకాన్ని అంద‌రూ చూశార‌న్నారు. ప్రతిపక్షాలను లేకుండా చేయాలన్న ధోరణిలో బీజేపీ ప‌నిచేస్తున్న‌ద‌ని దుయ్య‌బ‌ట్టారు. ఆ పార్టీని ఎవ‌రు ప్ర‌శ్నించినా వారిని టార్గెట్ చేస్తోంద‌ని, సీబీఐ, ఈడీల‌తో దాడులు చేయిస్తోంద‌ని మండిప‌డ్డారు. ఢిల్లీలో ఇటీవ‌ల జ‌రిగిన ఘ‌ట‌న‌లు చూస్తుంటే నిఘాసంస్థలు బీజేపీ పార్టీ జేబు సంస్థలుగా మారాయ‌నే అనుమానం క‌లుగుతోంద‌ని మంత్రి హ‌రీశ్‌రావు పేర్కొన్నారు.

ఒక పథకం ప్రకారం బీజేపీ స‌ర్కారు మత పరమైన కుట్ర‌ల‌కు పాల్ప‌డుతున్న‌ద‌న్నారు. మ‌త‌క‌ల‌హాలు దేశానికి, రాష్ట్రానికి అవ‌స‌ర‌మా? అని ఆయ‌న ప్ర‌శ్నించారు. తెలంగాణ‌లో కృష్ణా, గోదావరి నీళ్లు పారించాల‌ని టీఆర్ఎస్ చూస్తుంటే..మ‌త‌చిచ్చు రేపి ర‌క్తం పారించాల‌ని బీజేపీ చూస్తున్న‌ద‌ని మంత్రి హ‌రీశ్‌రావు వ్యాఖ్యానించారు. సీఎం కేసీఆర్ అధికారం చేప‌ట్ట‌గానే పెండింగ్ ప్రాజెక్టులు పూర్తిచేశార‌ని, దీంతో ప్ర‌తి ఎక‌రాకు నీరందుతున్న‌ద‌న్నారు. తాము పంటలను కొనలేమని కేంద్ర‌మే చేతులు ఎత్తేసేంత పంట తెలంగాణలో పండిందన్నారు. పండిన పంటలను కొనరు కానీ మన రాష్ట్రంలో మతచిచ్చు పెట్టి వాటితో చలి కాచుకునేందుకు సిద్దంగా బీజేపీ పార్టీని తరిమికోట్టాల్సిన బాధ్యత మనందరిపైన ఉందన్నారు. రెండు కోట్ల ఉద్యోగాలిస్తామ‌న్న కేంద్రం చేతులెత్తేస్తే.. రాష్ట్ర స‌ర్కారు రెండు ల‌క్ష‌ల ఉద్యోగాలిస్తున్న‌ద‌న్నారు. ఉచితాలు వ‌ద్దంటున్న బీజేపీ 20శాతం మంది కార్పొరేట్ల రుణాలు మాఫీ చేస్తున్న‌ద‌ని దుయ్య‌బ‌ట్టారు. తెలంగాణ స‌ర్కారు 80శాతం మంది సంక్షేమానికి నిధులు ఖ‌ర్చుచేస్తున్న‌ద‌ని ఈ సందర్భంగగా గుర్తు చేశారు. మంచి చేసేవారెవ‌రో? చెడు చేసేవారెవ‌రో ప్ర‌జ‌ల‌కు తెలుసని మంత్రి హ‌రీశ్‌రావు పేర్కొన్నారు.

- Advertisement -