కొంతకాలంగా మోడీ సర్కార్‌ను టార్గెట్ చేస్తూ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఓటు చోరి ఆరోపణలు చేస్తున్న సంగతి తెలిసిందే. దీనిపై కౌంటర్ ఎటాక్‌ను కర్ణాటక నుండే ప్రారంభించింది బీజేపీ. కాంగ్రెస్ నేతృత్వంలోని కర్ణాటక ప్రభుత్వం నిర్వహించిన సర్వేనే రాహుల్ గాంధీ ఈవీఎంలు, ఎన్నికల కమిషన్‌పై చేస్తున్న వ్యాఖ్యలకు సమాధానమని బీజేపీ పేర్కొంది.
రాహుల్ గాంధీ ..ఈవీఎంలు, భారత ఎన్నికల కమిషన్ (ECI)పై పదే పదే “అబద్ధాలు” చెబుతున్నారని విమర్శించారు. అయితే, అదే కాంగ్రెస్ ప్రభుత్వం కర్ణాటకలో నిర్వహించిన సర్వే ద్వారా ఆయన వ్యాఖ్యలు తప్పని నిరూపితమయ్యాయని అన్నారు. ఆ సర్వే ప్రకారం కర్ణాటక ఓటర్లు ఈవీఎంలపై నమ్మకం ఉంచుతున్నారని, భారతదేశంలో ఎన్నికలు స్వేచ్ఛగా, న్యాయంగా జరుగుతున్నాయని విశ్వసిస్తున్నారని పూనావాల్లా తెలిపారు.
సర్వే వివరాలను వెల్లడిస్తూ, అన్ని విభాగాల్లోని ప్రతిస్పందకులలో మెజారిటీ అయిన 84.55 శాతం మంది భారతదేశంలో ఎన్నికలు స్వేచ్ఛగా, న్యాయంగా జరుగుతున్నాయని అంగీకరించారని చెప్పారు. అలాగే 83.61 శాతం మంది ఈవీఎంలు విశ్వసనీయమైనవని నమ్ముతున్నారని పేర్కొన్నారు. 2023లో 77.9 శాతంగా ఉన్న ఈవీఎంలపై నమ్మకం ప్రస్తుతం 83.61 శాతానికి పెరిగిందని కూడా సర్వే తెలిపిందన్నారు.
కర్ణాటక అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడైన బీజేపీ నేత ఆర్. అశోక్ కూడా ఈ సర్వేను ఉదహరిస్తూ రాహుల్ గాంధీపై విమర్శలు చేశారు. ఇది కాంగ్రెస్ ముఖంపై కొట్టిన చాటుగా ఉందని అన్నారు. ఓటమి ఎదురైనప్పుడు మాత్రమే కాంగ్రెస్ సంస్థలను ప్రశ్నిస్తుందని, గెలిచినప్పుడు మాత్రం అదే వ్యవస్థను పొగడ్తలతో ముంచెత్తుతుందని విమర్శించారు. ఇది సిద్ధాంత రాజకీయాలు కాదని, అవసరానికి తగ్గ రాజకీయాలేనని ఆయన వ్యాఖ్యానించారు.
Also Read:పోలీసుల అదుపులో మావోయిస్టు దేవా!

