బండి స్పీకింగ్..రామచందర్‌రావు స్లీపింగ్..!

257
bandi
- Advertisement -

తెలంగాణలో మరి కొద్ది రోజుల్లో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ప్రధాన రాజకీయ పార్టీలు జోరుగా ప్రచారం చేస్తున్నాయి. పాలమూరు, రంగారెడ్డి, హైదరాబాద్ ఎమ్మెల్సీ స్థానంలో గెలుపును అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రతిష్టాత్మకంగా ఉన్నాయి. ఇక్కడ బీజేపీ సిట్టింగ్ ఎమ్మెల్సీ రామచందర్‌రావు మళ్లీ బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ నుంచి మాజీ మంత్రి చిన్నారెడ్డి, వామపక్షాల మద్దతుతో స్వతంత్ర అభ్యర్థిగా ప్రొఫెసర్ నాగేశ్వర్‌ బరిలో ఉన్నారు. కాగా తమకు అచ్చిరాని ఈ గ్రాడ్యుయేట్ స్థానంలో ఈసారి ఎలాగైనా గెలవాలని అధికార టీఆర్ఎస్ పట్టుదలగా ఉంది. అందుకే సీఎం కేసీఆర్ బీజేపీకి చెక్ పెట్టేందుకు వ్యూహాత్మకంగా దివంగత ప్రధాని పీవీ నరసింహారావు కుమార్తె, విద్యావేత్త సురభివాణిని టీఆర్ఎస్ అభ్యర్థిగా బరిలోకి నిలిపారు. మరోవైపు నల్గొండ, ఖమ్మం, వరంగల్ స్థానంలో కూడా బీజేపీ అభ్యర్థి గెలిచే అవకాశాలు లేవని వార్తలు వస్తున్న నేపథ్యంలో బండి హైదరాబాద్ స్థానంపైనే ఎక్కువగా ఫోకస్ పెట్టాడు. కాని పీవీ కుమార్తె ఎంట్రీతో మళ్లీ సిట్టింగ్ ఎమ్మెల్సీ స్థానంలో మళ్లీ గెలుపు ఖాయమనుకున్న బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌కు గట్టి షాక్ తగిలినట్లైంది.

అందుకే బండి సంజయ్ ఎక్కువగా హైదరాబాద్ ఎమ్మెల్సీ స్థానంలోనే ప్రచారం చేస్తున్నాడు. ఉద్యోగాల విషయంలో కేసీఆర్ సర్కార్‌‌పై బండి సంజయ్ చేసిన ఆరోపణలు మంత్రి కేటీఆర్ శాఖలవారీగా లెక్కలు చెప్పడంతో బూమరాంగ్ అయ్యాయి. ఇక ఐటీఐఆర్ విషయంలో కేంద్రం చేసిన మోసాన్ని టీఆర్ఎస్ ఎండగడుతుండడంతో జవాబు చెప్పలేక బండి సతమతమవుతున్నాడు. హైదరాబాద్ ఎమ్మెల్సీ స్థానంలో టీఆర్ఎస్ అభ్యర్థి వాణిదేవి, ప్రొఫెసర్ నాగేశ్వర్‌ మధ‌్యనే పోటీ అని, సిట్టింగ్ ఎమ్మెల్సీ రామచందర్‌రావు మూడవస్థానానికి పడిపోయారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. గత ఆరేళ్లుగా ఎమ్మెల్సీగా ఉన్న రామచందర్‌రావు ఏనాడు ఉద్యోగులు, పట్టభద్రుల సమస్యలపై ప్రభుత్వాలను ప్రశ్నించింది లేదు. నిరుద్యోగ యువత పక్షాన నిలబడి గొంతు విప్పింది లేదు. హైదరాబాద్‌లో ఐటీఆర్‌ ఏర్పాటు చేస్తే దాదాపు 2.7 లక్షల ఉద్యోగాలు వచ్చేవి కాని..ఎమ్మెల్సీ రామచందర్‌రావు తమ కేంద్ర నాయకత్వాన్ని ఐటీఐఆర్‌ గురించి ప్రశ్నించి లేదు. రామచందర్‌రావుకు అసలు ఎమ్మెల్సీ పోస్ట్ ఇష్టం లేదు..అందుకే ఎమ్మెల్యే, ఎంపీ ఎన్నికలలో కూడా పోటీ చేసి గెలవాలని ప్రయత్నిస్తున్నారు.

ఆరేళ్లుగా ఎమ్మెల్సీగా పట్టభద్రుల సమస్యలను గాలికి వదిలేసి నిద్రపోయిన రామచందర్‌రావు ఇప్పుడు ఎన్నికలు రాగానే తగుదనమ్మా అంటూ బయలుదేరడంపై యువత మండిపడుతోంది. ఆరేళ్లుగా నిద్రపోయిన రామచందర్‌రావుకు ఓటు వేసేది లేదని పట్టభద్రులు తేల్చిచెబుతున్నారు. తాజాగా రామచందర్‌రావు నిజంగానే ఆరేళ్లుగా నిద్రపోతున్నాడనే విషయాన్ని రుజువు చేస్తూ సోషల్ మీడియాలో ఓ సెటైరికల్ వీడియో వైరల్ అవుతోంది. ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా అధ్యక్షుడు బండి సంజయ్ బీజేపీ అభ్యర్థి రామచందర్‌రావుతో కలిసి ప్రెస్‌మీట్ పెట్టాడు. షరామామూలుగా బండి ఉద్యోగాల విషయంలో, పీఆర్సీ విషయంలో టీఆర్ఎస్ సర్కార్‌పై విమర్శలు చేస్తూనే ఉన్నారు. అయితే అప్పుడే మధ్యాహ్నం లంచ్‌లో పప్పన్నం, పెరుగు వేసుకుని దిట్టంగా తినివచ్చారో లేక..బండి సంజయ్ పెద్ద నోరేసుకుని రంకెలు వేస్తుండడంతో జోల పాడినట్లు అనిపించిందో కానీ రామచందర్‌రావు తాపీగా నిద్రపోయారు. ఓ పక్కన అధ్యక్షుడు బండి వీరావేశంతో మాట్లాడుతుంటే..ఇలా రామచందర్‌రావు నిద్రపోవడంపై సోషల్ మీడియాలో ఓ రేంజ్‌లో ట్రోలింగ్ జరుగుతోది.. ఆరేళ్లు పట్టభద్రుల సమస్యలను పట్టించుకోకుండా రామచందర్‌రావు ఇలానే కుంభకర్ణుడిలా నిద్రపోయాడని..మళ్లీ గెలిపించినా ఇలాగే నిద్రపోతాడని ఆయన్ని గెలిపించడం వేస్ట్ అని యువత అంటోంది. విద్యావేత్త అయిన వాణిదేవికి పట్టభద్రుల సమస్యలు తెలుస్తాయని ఈసారి ఓటు ఆమెకే అని పట్టభద్రులు అంటున్నారు. మొత్తంగా బండి సంజయ్ స్పీకింగ్..రామచందర్‌రావు స్లీపింగ్ అంటూ సోషల్ మీడియాలో ఓ వీడియో సోషల్ మీడియాలో ఓ రేంజ్‌లో వైరల్ అవుతోంది.

- Advertisement -