తెలంగాణలో బీజేపీ, టీఆర్ఎస్ మధ్య డైలాగ్ వార్ నడుస్తోంది.. వడ్ల కొనుగోలు అయితేనేం.. బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్ర అయితేనే.. ఏదైనా.. నేతల మధ్య విమర్శల పర్వం కొనసాగుతుంది. బీజేపీ నేతల వ్యవహార శైలి, వారు మాట్లాడుతున్న అడ్డగోలు మాటలపై మంత్రి కేటీఆర్‌తో పాటు,టీఆర్‌ఎస్ నేతలు కౌంటర్ ఎటాక్ చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే దుబ్బా ఎమ్మెల్యే రఘునందన్ రావు నోటిదురుసుతనంపై యావత్ తెలంగాణ సమాజం భగ్గుమంటోంది. ట్రాన్స్‌కో, జెన్‌కో సీఎండీ దేవులపల్లి ప్రభాకర్‌రావుపై నోరుపారేసుకోవడంపై బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్‌రావుపై తెలంగాణ వాదులు మండిపడుతున్నారు. సీఎం కేసీఆర్ 20 ఏండ్ల కిందట పదవీ విరమణ చేసిన వ్యక్తిని తీసుకొచ్చి విద్యుత్తు సంస్థల సీఎండీని చేశారంటూ రఘునందన్‌రావు విమర్శించారు. అయితే రఘునందన్ ఇక్కడే అడ్డంగా దొరికిపోయారని నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు.
ప్రధాని నరేంద్రమోదీ ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్న ప్రమోద్‌కుమార్ మిశ్రా వయసెంతో తెలుసా? అని ప్రశ్నిస్తున్నారు. ప్రమోద్‌కుమార్ 1948 ఆగస్టు 11న జన్మించారు. 1972లో ఐఏఎస్‌కు ఎంపికయ్యారు. 2013లో పదవీ విరమణ చేశారు. ఆ తర్వాత ప్రధాన మంత్రి నరేంద్రమోదీ ఏరికోరి ఆయనను 2019 సెప్టెంబర్ 11న తన ప్రధాన కార్యదర్శిగా నియమించుకొన్నారు. ఎప్పుడో రిటైర్ అయిన, 74 ఏండ్ల వ్యక్తిని ప్రధాన మంత్రి నియమించుకున్నది కనిపించలేదా? అని రఘునందన్‌రావును నెటిజన్లు నిలదీస్తున్నారు.కేంద్రానికి ఒక నీతి? రాష్ట్రానికి ఒక నీతా? అని ప్రశ్నిస్తున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో కలిసి ఉన్నప్పుడు విద్యుత్ లేక అంధకారంలో కొట్టుమిట్టాడిన తెలంగాణలో సీఎం కేసీఆర్ స్వరాష్ట్రంలో ఆరు నెలల్లోనే వెలుగులు నింపారని, ఈ కృషిలో ప్రభాకర్‌రావు అత్యంత కీలక పాత్ర పోషించారనే విషయాన్ని గుర్తుచేస్తున్నారు.
సీఎం కేసీఆర్ ఆకాంక్షల మేరకు ప్రభాకర్‌రావు నేతృత్వంలో అన్ని రంగాలకు 24 గంటల విద్యుత్తు సరఫరా అవుతున్నదని, ఇలాంటి సదుపాయం మోదీ సొంత రాష్ట్రం గుజరాత్‌లో అయినా, ఇతర ఏ బీజేపీ పాలిత రాష్ట్రంలో అయినా ఉన్నదా? అని నిలదీస్తున్నారు. ఇప్పటికైనా రఘునందన్ రావు ఇష్టమొచ్చినట్టు మాట్లాడడం మానుకోవాలని లేదంటే తగిన గుణపాఠం తప్పదని పలువురు హెచ్చరిస్తున్నారు. బీజేపీ నేతలకు అడ్డగోలుగా, నోటికొచ్చినట్టు మాట్లాడడం అలవాటైందని, బీజేపీ విధానాలతో ప్రజలు విసుగెత్తుతున్నారని, తమ ఆదరణ తగ్గుతుండడంతో బీజేపీ నేతలు కల్లుతాగిన కోతుల్లాగా దురుసుగా మాట్లాడుతున్నారని, ఇకనైనా బీజేపీ నేతలు నోరు అదుపులో పెట్టుకోవాలని హెచ్చరిస్తున్నారు.