కర్ణాటకలో సంచలనం సృష్టించిన లంచం కేసులో గదగ్ జిల్లాకు చెందిన బీజేపీ ఎమ్మెల్యే డా. చంద్రు లమాని అరెస్టయ్యారు. శిరహట్టి నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న లమానిని లోకాయుక్త పోలీసులు శనివారం (ఫిబ్రవరి 21) నాడు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ప్రజా పనులకు సంబంధించిన అవినీతి వ్యవహారంలో ఆయన ప్రమేయం ఉన్నట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. 2023 ఎన్నికల్లో గెలిచిన ప్రముఖ ఎస్సీ నేతగా గుర్తింపు పొందిన లమాని అరెస్టుతో రాష్ట్ర రాజకీయాల్లో కలకలం రేగింది.
విజయ్ పూజారి అనే క్లాస్-1 కాంట్రాక్టర్ ఇచ్చిన అధికారిక ఫిర్యాదు ఆధారంగా లోకాయుక్త అధికారులు స్టింగ్ ఆపరేషన్ నిర్వహించారు. మైనర్ ఇరిగేషన్ శాఖ రిటైనింగ్ వాల్ ప్రాజెక్టుకు సంబంధించి రూ.11 లక్షల లంచం డిమాండ్ చేశారని పూజారి ఆరోపించారు. ఈ క్రమంలో స్టింగ్ ఆపరేషన్‌లో భాగంగా పూజారి రూ.5 లక్షలు నగదుగా అందజేస్తుండగా లోకాయుక్త బృందాలు దాడి చేసి లమానిని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నాయి.
ఈ కేసులో ఎమ్మెల్యేతో పాటు ఆయన వ్యక్తిగత సహాయకులు మంజునాథ్ వాల్మీకి, గురునాథ్‌లను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రాజెక్టు ఆమోదాలు, అమలులో సహకారం అందించేందుకు కాంట్రాక్టర్‌పై ఒత్తిడి తెచ్చి లంచాలు వసూలు చేసినట్లు అనుమానిస్తున్నారు. వారి ప్రమేయంపై మరింత విచారణ కొనసాగుతోంది.
Also Read:రైతు బడి అగ్రి షోలో మాజీ మంత్రి హరీష్

