ఉప ఎన్నికల్లో కమలానికి ఎదురుగాలి..

216
bjp

దేశ వ్యాప్తంగా జరిగిన ఉప ఎన్నికల్లో బీజేపీకి గట్టి షాక్ తగిలింది. 4 లోక్ సభ స్ధానాలు,11 అసెంబ్లీ స్ధానాలకు ఎన్నికలు జరగగా ఫలితాల్లో బీజేపీ భంగపడింది. అందరిదృష్టిని ఆకర్షించిన ఉత్తరప్రదేశ్‌ కైరానా నియోజకవర్గం నుంచి ఆర్‌ఎల్డీ అభ్యర్ధి తబస్సుమ్ హసన్‌ 70 వేలకు పైగా ఆధిక్యంలో దూసుకుపోతున్నారు. ఆయన విజయం లాంఛనమే కానుంది. బాంద్రా-గోండియా స్థానం (మహారాష్ట్ర)లో ఎన్సీపీ అభ్యర్థి ఆధిక్యంలో నిలిచారు. పాల్ఘడ్‌(మహారాష్ట్ర)లో శివసేన అభ్యర్థిపై బీజేపీ అభ్యర్థి విజయం సాధించారు.

కర్ణాటకలోని రాజరాజేశ్వరి నగర్‌ అసెంబ్లీ నియోజకవర్గంలో కాంగ్రెస్‌ పార్టీ ఘనవిజయం సాధించింది. కాంగ్రెస్‌ అభ్యర్థి మునిరతన్‌ బీజేపీ అభ్యర్థి మునిరాజు గౌడపై భారీ మెజార్టీతో విజయం సాధించారు. మేఘాలయలోని అంపతి అసెంబ్లీ స్థానంలో కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి విజయం సాధించారు. కేరళలోని చెన్‌గన్నూర్‌ శాసనసభ నియోజకవర్గంలో ఎల్‌డీఎఫ్‌ అభ్యర్థి సాజి చెరియన్‌ 20,956ఓట్ల తేడాతో గెలుపొందారు.

పంజాబ్‌లోని షాకోట్‌ కాంగ్రెస్‌ అభ్యర్థి విజయం దిశగా దూసుకుపోతున్నారు. ఉత్తర ప్రదేశ్‌లోని నూర్పూర్‌(అసెంబ్లీ స్థానం) బీజేపీకి షాక్‌ తగిలింది. బీజేపీ సిట్టింగ్‌ నియోజకవర్గంలో ఎస్పీ అభ్యర్థి విజయం సాధించారు. మహేస్తల-పశ్చిమ బెంగాల్‌లో టీఎంసీ అభ్యర్థి విజయం దాదాపు ఖరారైంది. జార్ఖండ్‌లోని గోమియా స్థానంలో బీజేపీ అభ్యర్థి, సిలీ స్థానంలో జేఎంఎం అభ్యర్థులు గెలుపు సాధించారు.

ఇక బీహార్‌లో జేడీయుకి ఆర్జేడీ గట్టిషాకిచ్చింది. జేడీయూ అభ్యర్ధిని ఆర్జేడీ నేత షానవాజ్ దాదాపుగా 40 వేల ఓట్ల తేడాతో ఓడించారు. ఇరు పార్టీల మధ్య బలప్రదర్శనకు వేదికగా మారిన ఈ ఎన్నికల్లో ఆర్జేడీ పైచేయి సాధించింది. ఈ ఓటమితో జేడీయూ శిబరం చిన్నబోయింది.