KTR:కాంగ్రెస్‌ను ఓడించండి

5
- Advertisement -

కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన మేనిఫెస్టోను సీఎం రేవంత్ రెడ్డి పూర్తిగా తుంగలో తొక్కుతున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర విమర్శలు చేశారు. అబద్ధపు హామీలు, అడ్డగోలు వాగ్దానాలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం, ఇప్పుడు ప్రజలను పక్కన పెట్టి పరిపాలనను విస్మరించిందని మండిపడ్డారు.

చేవెళ్ల నియోజకవర్గానికి చెందిన బీజేపీ నేత, మాజీ ఎంపీపీ విజయ్ భాస్కర్ రెడ్డి తన అనుచరులతో కలిసి బీఆర్ఎస్‌లో చేరిన సందర్భంగా హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో జరిగిన కార్యక్రమంలో కేటీఆర్ మాట్లాడారు. మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో కేటీఆర్ విజయ్ భాస్కర్ రెడ్డికి గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ హామీలతో ప్రజలను మోసం చేస్తుందని ఆనాడే చెప్పామని, అదే విధంగా రేవంత్ రెడ్డి రెండేళ్లలో ఏ ఒక్క వర్గాన్నీ వదలకుండా అందరినీ మోసం చేశారని అన్నారు. వృద్ధులు, మహిళలు, విద్యార్థులు, ప్రభుత్వ ఉద్యోగులు సహా అన్ని వర్గాలు కాంగ్రెస్ పాలనలో ఇబ్బందులు పడుతున్నాయని తెలిపారు. కేసీఆర్ పాలనలో సంతోషంగా ఉన్న ప్రజలు నేడు ఆందోళనలో ఉన్నారని పేర్కొన్నారు.

శాసనసభ స్పీకర్ ధృతరాష్ట్రుడిలా వ్యవహరిస్తున్నారని కేటీఆర్ విమర్శించారు. చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య కాంగ్రెస్ కార్యక్రమాల్లో పాల్గొంటున్నా, స్పీకర్ గమనించకుండా ఆయన ఇంకా బీఆర్ఎస్‌లోనే ఉన్నారని చెబుతున్నారని ఎద్దేవా చేశారు. పదవులు, డబ్బుల కోసమే యాదయ్య కాంగ్రెస్‌లోకి వెళ్లారని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీకి ధైర్యముంటే యాదయ్యపై చర్యలు తీసుకుని ఎన్నికలకు వెళ్లాలని సవాల్ విసిరారు.

Also Read:Modi:వికసిత్ భారత్ దిశగా అడుగులు

వచ్చే మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాలని కేటీఆర్ ప్రజలకు పిలుపునిచ్చారు. కాంగ్రెస్‌కు ఓటేస్తే మళ్లీ మోసమే కొనసాగుతుందని హెచ్చరించారు. కేసీఆర్ తిరిగి వస్తేనే రాష్ట్రం బాగుపడుతుందని, ప్రజలకు న్యాయం జరుగుతుందని చెప్పారు. అందరూ కలిసి వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని ఓడించాలని పిలుపునిచ్చారు.

- Advertisement -