కాషాయ పార్టీలో అసంతృప్తి సెగలు..!

130
bandi
- Advertisement -

తెలంగాణ బీజేపీలో ఇప్పుడు సరికొత్త రగడ మొదలైంది. దశాబ్దాలుగా కాషాయ జెండాను మోస్తున్న సీనియర్లను పక్కనపెట్టేసి , నిన్న మొన్న ఇతర పార్టీల నుంచి వచ్చిన ఈటల వంటి వారికి ప్రాధాన్యం ఇవ్వడంతో కాషాయ కోటలో అసంతృప్తి జ్వాలలు ఎగసిపడుతున్నాయి. ఇటీవల బీజేపీ హైకమాండ్ ప్రకటించిన జాతీయ కార్యవర్గ సభ్యుల ప్రకటన తెలంగాణ కాషాయ సేనలో సెగలు రేపుతోంది. రాష్ట్రం నుంచి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, మాజీ ఎంపీలు వివేక్ వెంకటస్వామి, జితేందర్ రెడ్డి, గరికపాటి రామ్మోహన్ రావును నేషనల్ ఎగ్జిక్యూటివ్ మెంబర్లుగా నియమించారు. ప్రత్యేక ఆహ్వానితులుగా మాజీ ఎంపీ, సినీ నటి విజయశాంతి, మాజీ మంత్రి, హుజూరాబాద్ అభ్యర్థి ఈటల రాజేందర్ కు అవకాశం కల్పించారు.

అదేవిధంగా జాతీయ ఆఫీస్ బేరర్లలో తెలంగాణ నుంచి పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, ఏపీ నుంచి పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి పురందరేశ్వరికి, జాతీయ కార్యదర్శి సత్యకుమార్ కు చోటు లభించింది. శాశ్వత ఆహ్వానితులుగా పార్టీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు కె. లక్ష్మణ్, పార్లమెంటరీ పార్టీ ఆఫీసు సెక్రటరీ కామర్స్​ బాల సుబ్రమణ్యం(ఏపీ), తెలంగాణ ఇన్​చార్జ్​ తరుణ్ చుగ్, స్టేట్ చీఫ్​ బండి సంజయ్, తెలంగాణ శాసనసభ పక్ష నేత రాజా సింగ్, స్టేట్ జనరల్ సెక్రటరీ మంత్రి శ్రీనివాస్​ను నియమించారు. అయితే జాతీయ కార్యవర్గ సభ్యుల ప్రకటన తర్వాత తెలంగాణ బీజేపీలోని సీనియర్‌ నాయకులు అధిష్టానంపై మండిపడుతున్నారు.. గత జాతీయ కార్యవర్గంలో తెలంగాణ నుంచి ఇంద్ర సేనారెడ్డి, పేరాల శేఖర్‌రావులు సభ్యులుగా ఉన్నారు. అయితే ఈసారి కొత్త కమిటీలో వారికి చోటు లభించలేదు. వీరితోపాటు బీజేపీ సీనియర్‌ నేత.. మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావును పక్కన పెట్టేశారు. జాతీయ కార్యవర్గ సభ్యుల ప్రకటనపై బీజేపీ కీలక నేత ఒకరు గుర్రుగా ఉన్నారు. అంతర్గత వేదికలపై ఆయన గట్టిగానే నిలదీసినట్టు తెలుస్తోంది. మరోసారి జాతీయ కార్యవర్గ సభ్యత్వం ఆశించిన పేరాల శేఖర్‌రావుకు నిరాశే ఎదురైంది. అయితే తనను కమిటీలోకి తీసుకోకపోవడంపై నేరుగా స్పందించకపోయినా.. లింగోజీగూడ డివిజన్‌ ఉపఎన్నిక సందర్భంగా బీజేపీ నేతలు ప్రతి భవన్‌కు వెళ్లి మంత్రి కేటీఆర్‌ను కలిసిన ఇష్యూలో తనను బలిపశువును చేశారని పేరాల శేఖర్ ఏకంగా ఓ లేఖ విడుదల చేసి. బండి సంజయ్‌పై తీవ్ర విమర్శలు గుప్పించారు. లింగోజీగూడ విషయాన్ని పార్టీ సీరియస్‌గా తీసుకోవడం వల్లే ఆయన్ని పక్కన పెట్టారన్నది బండి వర్గం చెబుతోంది.

ఇక దశాబ్దాలుగా కాషాయ పార్టీనే నమ్ముకున్న బీజేపీ సీనియర్ నేత నల్లు ఇంద్రసేనారెడ్డిని కూడా ఈసారి జాతీయ కార్యవర్గంలో తీసుకోకపోవడం బీజేపీ వర్గాల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది. మొత్తంగా మొదటి నుంచి కాషాయ జెండా మోసిన సీనియర్ నేతలను కాదని ఇతర పార్టీల నుంచి వచ్చిన డీకే అరుణ, విజయశాంతి, వివేక్, ఈటల రాజేందర్ , గరికపాటి రామ్మెహన్ రావు వంటి నేతలకు జాతీయ కార్యవర్గంలో చోటు కల్పించడంతో తెలంగాణ బీజేపీలో అగ్గి రాజుకుంది. కొత్త ఒక వింత..పాత ఒక రోత అన్నట్లుగా బండి సంజయ్ అధ్యక్షుడు అయిన తర్వాత తమ లాంటి ఒరిజినల్ కాషాయ నేతలను పక్కనపెట్టి..ఇతర పార్టీల నుంచి వచ్చిన నకిలీ నేతలకు ప్రియారిటీ ఇస్తున్నారని సీనియర్లు వాపోతున్నారంట… పదవులు దక్కని రామచందర్‌రావు, ఇంద్రసేనారెడ్డి, పేరాల శేఖర్‌జీ తమ రాజకీయ భవిష్యత్తు కోసం కీలక నిర్ణయం తీసుకుబోతున్నారని, త్వరలోనే బీజేపీకి గుడ్‌బై చెప్పడం ఖాయమని కాషాయ పార్టీలో చర్చ జరుగుతోంది. మొత్తంగా జాతీయ కార్యవర్గ ప్రకటన తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌కు కొత్త తలనొప్పి తెచ్చిపెట్టిందనే చెప్పాలి.

- Advertisement -