సీఎం కేసీఆర్‌పై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన స్మృతి ఇరానీపై రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాద్యక్షుడు వినోద్ కుమార్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. తెలంగాణ ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావును విమర్శించే నైతిక హక్కు లేదని కేంద్ర మంత్రి స్మృతి ఇరానీకి ఘాటు లేఖ రాశారు. సీఎం కేసీఆర్ పై విమర్శలు చేసేముందు వాస్తవాలు తెలుసుకొని మాట్లాడాలన్నారు. ఇరానీ వ్యాఖ్యలు క్షమార్హం కాదన్నాయన… సంస్కారం గురించి మాట్లాడే నాయకులు బీజపీలో లేరన్నారు.
విపక్ష సీఎంలను, నేతలను కించపరచడం, మర్యాద లేకుండా వ్యవహరించడం ప్రధాని మోదీతో సహా బీజేపీ నాయకులకు వెన్నతో పెట్టిన విద్యన్నారు. భారత్ బయోటెక్ అభివృద్ధి చేసిన వ్యాక్సిన్ గురించి తెలుసుకొవడానికి 2020నవంబర్28న మోదీ హైదరాబాద్ పర్యటనకు వచ్చినప్పుడు… సీఎం కేసీఆర్ ఆహ్వానించేందుకు సిద్ధమైతే వద్దన్నది మీ ప్రభుత్వమే కదా! ప్రధాని మోదీకి ఆహ్వానం పలికేందుకు విమానాశ్రయానికి రాకుండా అడ్డుకున్నదెవరన్న సంగతి ఇప్పటి వరకు ఎవరూ చెప్పడం లేదన్నారు.