తెలంగాణలో వచ్చే ఎన్నికల్లో గెలిచి అధికారం చేపట్టాలని కాషాయ పార్టీ చేస్తున్న ప్రయత్నాలు అన్నీ ఇన్ని కావు. ప్రస్తుతం అధికారంలో ఉన్న కేసిఆర్ ప్రభుత్వంపై నిత్యం విమర్శలు, ఆరోపణలు చేస్తూ ప్రజల దృష్టిని కాషాయ పార్టీవైపు తిప్పాలని కమలనాథులు గట్టిగానే ప్రయత్నిస్తున్నారు. అయితే కేసిఆర్ ప్రభుత్వంపై బీజేపీ నేతలు చేసే ఆరోపణలు, విమర్శలు అన్నీ ఒట్టి మాటలే అని ఇప్పటికే చాలా సార్లు నిరూపితం అయింది. అయినప్పటికి రాజకీయ లబ్ది కోసం కేసిఆర్ సర్కార్ పై బురద చల్లే ప్రక్రియను మాత్రం ఆపడం లేదు కమలనాథులు.
తాజాగా ధరణి పోర్టల్ పై కేసిఆర్ సర్కార్ ను ఇరకాటంలో పెట్టేందుకు ప్రయత్నించి తామే ఇరుకున పడిపోయారు కాషాయ నేతలు. రైతుల ప్రయోజనార్థం భూ రిజిస్ట్రేషన్ ను సులభతరం చేసేందుకు కేసిఆర్ సర్కార్ ధరణి పోర్టల్ ను ప్రవేశ పెట్టిన సంగతి తెలిసిందే. ధరణి అందుబాటులోకి వచ్చిన తరువాత భూ రిజిస్ట్రేషన్ విధానాల్లో చాలానే మార్పులు వచ్చాయి. దాంతో అటు రైతులనుంచి ఇటు సామాన్యుల నుంచి ధరణిపై సానుకూలత మెండుగానే ఉంది. ఈ నేపథ్యంలో ధరణి పై రాజకీయం చేసేందుకు బీజేపీ ప్రయత్నించి చతికిల పడింది.
Also Read: KTR:పట్టణాభివృద్ధికి నిధులు కేటాయించాలి
తాము అధికారంలోకి వస్తే ధరణి ని పూర్తిగా రద్దు చేస్తామని ఇటీవల తెలంగాణకు వచ్చిన బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే ధరణి పోర్టల్ విషయంలో రద్దు చేయబోమని, కొద్దిగా మార్పులు మాత్రమే చేస్తామని గతంలో రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ చెప్పుకొచ్చారు. దీంతో ధరణి పోర్టల్ విషయంలో బిజెపీకే స్పష్టత లేదనే అభిప్రాయం ప్రజల్లో బలపడింది. దీంతో అస్థిర నిర్ణయాలకు కేంద్రంగా ఉన్న బీజేపీని తెలంగాణ ప్రజలు నమ్మే పరిస్థితి లేదని కొందరు రాజకీయ వాదులు చెబుతున్నారు. మొత్తానికి ధరణి విషయంలో కేసిఆర్ సర్కార్ ను ఇరుకున పెట్టేందుకు ప్రయత్నించి.. బీజేపీనే చతికిల పడిందనే చెప్పవచ్చు.
Also Read: హస్తం నేతల హడావిడి.. ఎందుకో మరి!