మీనాక్షి నటరాజన్‌కు షాకిచ్చిన బీజేపీ!

7
- Advertisement -

ఈ నెల 18న 10 రాష్ట్రాల నుండి ఖాళీగా ఉన్న 24 రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే అన్ని పార్టీలు అభ్యర్థులను ప్రకటించగా మధ్యప్రదేశ్ నుండి మూడో రాజ్యసభ స్థానం కోసం జరుగుతున్న పోటీ ఊహించని మలుపు తిరిగింది. భారతీయ జనతా పార్టీ , కాంగ్రెస్ మధ్య హోరాహోరీ రాజకీయ పోరాటంగా మారింది.

మధ్యప్రదేశ్ మత్స్య కళ్యాణ్ బోర్డ్ ఛైర్మన్ మహేష్ కేవత్‌ను బీజేపీ తమ మూడో అభ్యర్థిగా బరిలోకి దించింది. దీంతో అత్యంత ఉత్కంఠ భరితంగా మారిన ఈ ఎన్నికల బరిలో కాంగ్రెస్ అభ్యర్థి మీనాక్షి నటరాజన్‌ను కేవత్ ఢీకొట్టబోతున్నారు. బీజేపీ తీసుకున్న ఈ నిర్ణయంతో ఇప్పటికే తీవ్ర పోటీ నెలకొన్న ఈ రేసు మరింత సంక్లిష్టంగా మారింది.

మహేష్ కేవత్ బీజేపీలో సుదీర్ఘ సంస్థాగత అనుభవం ఉన్న సీనియర్ నాయకుడు. ఎన్నికల వ్యూహం, నామినేషన్ లాంఛనాలపై చర్చించిన అనంతరం కేవత్ పేరును మూడో అభ్యర్థిగా ఖరారు చేశారు. అంతకుముందు శనివారమే బీజేపీ అభ్యర్థులు తరుణ్ చుగ్, రజనీష్ అగర్వాల్ తమ నామినేషన్లను దాఖలు చేయడంతో బహుముఖ రాజకీయ పోటీకి తెరలేచింది.

బీజేపీ మూడో అభ్యర్థిని రంగంలోకి దించడంతో కాంగ్రెస్ శ్రేణుల్లో ఆందోళన మొదలైనట్లు తెలుస్తోంది. క్రాస్ ఓటింగ్ జరుగుతుందనే భయాలు, మారే రాజకీయ సమీకరణల నేపథ్యంలో.. కాంగ్రెస్ తమ ఎమ్మెల్యేలందరినీ ఐక్యంగా ఉంచేందుకు ముందస్తు జాగ్రత్తగా తెలంగాణకు తరలించాలని ఆలోచిస్తున్నట్లు సమాచారం.

Also Read:#RAPO23లో సినిమాటోగ్రాఫర్ తిరు

230 మంది సభ్యులున్న మధ్యప్రదేశ్ అసెంబ్లీలో బీజేపీకి 164 మంది ఎమ్మెల్యేలు ఉండగా…కాంగ్రెస్‌కు 63 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఒక రాజ్యసభ స్థానాన్ని గెలవడానికి అభ్యర్థికి 58 మొదటి ప్రాధాన్యత ఓట్లు అవసరం. రెండు స్థానాలను సునాయాసంగా గెలుచుకున్న తర్వాత కూడా బీజేపీ వద్ద ఇంకా 48 మంది ఎమ్మెల్యేల ఓట్లు ఉన్నాయి.దీంతో మూడో స్థానాన్ని దక్కించుకోవాలంటే బీజేపీ క్రాస్ ఓటింగ్‌పై లేదా ఇతర పార్టీల ఎమ్మెల్యేల మద్దతుపై ఆధారపడాల్సి ఉంటుంది. ఇదే ఇప్పుడు కాంగ్రెస్ శిబిరంలో గుబులు రేపుతోంది.

- Advertisement -