అంతా ఉహించినట్లుగానే జరిగింది.ఎన్నికల విశ్లేషకులు, పోల్ సంస్థలు ఊహించినట్టుగానే ఢిల్లీ మునిసిపల్ ఎన్నికల్లో బీజేపీ హవా కొనసాగింది. అధికార ఆమ్ ఆద్మీ పార్టీ ఘోరంగా విఫలమై, రెండో స్థానానికి పరిమితం కాగా, కాంగ్రెస్ తన ఉనికిని చాటుకుంది. మూడు నగరపాలక సంస్థల్లోని 272 స్థానాలకు గాను, ఇద్దరు అభ్యర్థులు మరణించడంతో 270 చోట్ల మాత్రమే ఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే.
ఇవాళ ఉదయం నుంచి ఎన్నికల లెక్కింపు ప్రారంభం కాగా, బీజేపీ స్పష్టమైన ఆధిక్యతను సంపాదించింది. 270 స్ధానాల్లో బీజేపీ 180, కాంగ్రెస్ 35,ఆప్ 45 స్ధానాలను గెలుచుకున్నాయి. ఇటీవల జరిగిన రాజౌరీ గార్డెన్ ఉప ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించడం ఈ ఎన్నికలపై ప్రభావాన్ని చూపింది.ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ అఖండ విజయం సాధించిన విషయం తెలిసిందే. అయితే ఇటీవల ఆప్ నేతలు అనేక ఆరోపణలు ఎదుర్కోవడంతో పార్టీ చిక్కుల్లో పడింది. దీనికి తోడు బీజేపీ వ్యూహాలు కూడా ఈ ఎన్నికల్లో ఆప్‌ను వెనక్కి నెట్టేశాయి. అటు ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు కూడా మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ క్లీన్‌స్వీప్ చేస్తుందని చెప్పాయి. ఎగ్జిట్ పోల్స్ ఉహించినట్లుగానే ఢిల్లీపై కాషాయ జెండా ఎగిరింది.
గత అసెంబ్లీ ఎన్నికలలో ఢిల్లీ కార్పొరేషన్ లో ఆమ్ ఆద్మీ పార్టీ మొత్తం 70 స్థానాలకు గాను 67 స్థానాలు గెలుచుకుని తిరుగులేని ఆధిక్యం కనబరిచినా, తాజా కార్పొరేషన్ ఎన్నికలలో పూర్తిగా చతికిలబడుతోంది. ఈవీఎంల గురించిన వివాదాలు, ఢిల్లీలో ప్రజారోగ్యం గురించిన విమర్శలు.. వీటన్నింటి నడుమ ఈ ఎన్నికలు జరగడం, వాటిలో బీజేపీ ఆధిక్యం చూపిస్తుండటం విశేషం.