బండికి షాక్‌.. కారెక్కిన బీజేపీ కార్పొరేటర్లు..

156
- Advertisement -

కరీంనగర్‌లో తెలంగాణ బీజేపీ పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్‌కి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. బండి సంజయ్‌ వ్యవహరిస్తున్న తీరు.. బీజేపీ పార్టీ విధానాలు నచ్చక ఆ పార్టీకి చెందిన ఇద్దరు కార్పొరేటర్లు బండికి బై.. బై.. చెప్పి మంత్రి కేటీఆర్‌ సమక్షంలో గూలాబీ గూటికి చేరారు. గత కొంత కాలంగా కరీంనగర్‌ బీజేపీలో గ్రూపు రాజకీయాలు నడుస్తున్నాయన్న విషయం తెలిసిందే. కరీంనగర్‌లో బండి సంజయ్‌ వ్యవహరిస్తున్న తీరుతో పాటు ఆ పార్టీలో గ్రూపు రాజకీయాలతో వేగలేక కాషాయ పార్టీ కార్పొరేటర్లు కారెక్కారు. ఈ పరిణామాలు చూస్తే కరీంనగర్‌ లో బీజేపీకి భవిష్యత్తులో గడ్డుకాలమే రాబోతుందని చెప్పవచ్చు.

కరీంనగర్‌ ఎంపీగా గెలిచిన బండి సంజయ్‌ తాను గెలిచినప్పటి నుంచి ఇప్పటి వరకు కరీంనగర్‌ అభివృద్ధికి చేసిందేం లేదనే విమర్శలు వెల్లువెత్తున్న తరుణం ఒకవైపు అయితే.. మరోవైపు సీఎం కేసీఆర్‌ నాయకత్వంలో.. పట్టణాభివృద్ధి శాఖా మంత్రి కేటీఆర్‌.. మంత్రి గంగుల కమలాకర్ నాయకత్వంలో కరీంనగర్ పట్టణంతో పాటు జిల్లా కూడా అభివృద్దిలో దూసుకుపోతుండడంతో కరీంనగర్‌ లో కారు పార్టీ జోరు అప్రతిహాతంగా కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో భవిష్యత్తులో కారు పార్టీ జోరును తట్టుకోలేక కాంగ్రెస్‌, బీజేపీ పార్టీలు బొక్కాబొర్ల పడక తప్పదని, రానున్న రోజుల్లో కాంగ్రెస్‌, బీజేపీ పార్టీల అడ్రస్‌ కరీంనగర్‌ గడ్డపై గల్లంతు కావడం ఖాయమనే భావనతో ఉన్న బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీ నేతలు ఒక్కరు తమ పార్టీలను వీడి గులాబీ గూటిలో చేరుతున్నారు.

ఎంపీ బండి సంజయ్‌ ను చెంప చెల్లుమనేటట్టు ఆ పార్టీకి చెందిన ఇద్దరు కార్పొరేటర్లతో పాటు దాదాపు 200 మంది కార్పొరేటర్లు బీజేపీని వీడి టీఆర్‌ఎస్‌లో చేరడం చూస్తే ఇక భవిష్యత్తులో కరీంనగర్‌లో బండి సంజయ్‌ దుకాణం బంద్‌ అవడం ఖాయమని, ఒక్కొక్కరు బీజేపీ పార్టీకి గుడ్‌ బై చెప్పడం తొందరలోనే జరుగుతుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికే కరీంనగర్‌ లో బండి సంజయ్‌కి వ్యతిరేకంగా గ్రూపు రాజకీయాలు నడుస్తున్నాయని, బీజేపీ పార్టీకి చెందిన పలువురు సీనియర్‌ బండికి వ్యతిరేకంగా రహస్యంగా భేటీ అయ్యారని వార్తలు వస్తున్న నేపథ్యంలో తాజాగా కార్పొరేటర్లతో పాటు పెద్ద సంఖ్యలో కార్యకర్తలు బీజేపీని వీడడం బండి సంజయ్‌కి గట్టి దెబ్బ అనే చెప్పాలి. ఇప్పటికైనా బండి సంజయ్‌ తన వ్యవహార శైలిని మార్చుకుని పార్టీ వ్యవహారాలను చక్కదిద్దకపోతే భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని పలువురు అభిప్రాయపడుతున్నారు.

- Advertisement -