బీజేపీకి రాష్ట్రంలో ఓటు అడిగే నైతిక హక్కు లేదు- కేటీఆర్‌

127
ktr
- Advertisement -

హైదరాబాద్ – రంగారెడ్డి – మహబూబ్ నగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపైన నగర ఎమ్మెల్యేలు మరియు కార్పొరేటర్లు, ఇతర ప్రజాప్రతినిధులతో తెలంగాణ భవన్‌లో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమావేశమై పార్టీ శ్రేణులతో మాట్లాడారు. ఈ అనేక ప్రతికూల పరిస్థితుల మధ్య ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించిన గొప్ప నాయకుడు మన పార్టీ అధ్యక్షులు, రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్. ఒకప్పుడు హైదరాబాద్ నగరంలో కార్పొరేటర్లుగా పోటీ చేసేందుకు నాయకులు లేరన్న పరిస్థితి నుంచి రెండు సార్లు జీహెచ్ఎంసీలో అతి పెద్ద విజయాలు సాధించి మేయర్ పీఠం దక్కించుకునే స్థాయికి పార్టీ చేరుకుంది అన్నారు. ఏ పార్టీకైనా ప్రతి ఎన్నిక అత్యంత కీలకమైనది అనే విషయాన్ని మనం అందరం గుర్తుంచుకోవాలి. ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కలిసికట్టుగా ముందుకు నడిచి విజయం సాధించే దిశగా కార్యక్రమాలు తీసుకుందామని పార్టీ శ్రేణులకు కేటీఆర్ సూచించారు.

మన పార్టీ అభ్యర్థి సురభి వాణి దేవి అభ్యర్థిత్వాన్ని మన ప్రత్యర్థులు సైతం అభినందించేంత సానుకూల పరిస్థితులు మనకు ఉన్నాయి. ఆమెకున్న అత్యంత క్లీన్ ఇమేజ్ కచ్చితంగా గ్రాడ్యుయేట్లకు నచ్చుతుందనే నమ్మకం ఉన్నది. ఇప్పటికే అన్ని వర్గాల నుంచి మన పార్టీ అభ్యర్థికి సానుకూల స్పందన లభిస్తున్నది. ఈ ఎన్నికల్లో పార్టీ శ్రేణులంతా ఐక్యంగా పనిచేసి వాణి దేవిని గెలిపించుకోవాలి. ఈ ఎన్నికల్లో వ్యూహాత్మకంగా పని చేయాల్సిన అవసరం ఉన్నది. ప్రతిపక్ష పార్టీ ముఖ్యంగా బీజేపీ ఢిల్లీ నుంచి గల్లీ దాకా అసత్య ప్రచారాలు చేయడమే తన పనిగా పెట్టుకున్నది. మిషన్ భగీరథ లాంటి ప్రతిష్టాత్మక కార్యక్రమం ద్వారా ఇంటింటికీ నల్ల నీరు మన ప్రభుత్వం అందిస్తే తమ ఘనతగా చెప్పుకుంటున్నది బీజేపీ నాయకత్వం. వాట్సాప్ యూనివర్సిటీ ద్వారా తమ ఆసత్యాలను పంచుకుంటున్నది. బీజేపీ అసత్యాల ప్రలోభాలకు గురికాకుండా విద్యావంతులకు మనం చేసిన పనులను బలంగా చెప్పాలని పార్టీ వర్గాలకు కేటీఆర్‌ ఆదేశించారు.

కాంగ్రెస్ పార్టీకి వారికి చరిత్ర ఉన్నది గాని, భవిష్యత్తు మాత్రం లేదు. ఈ రెండు పార్టీలు మన పార్టీ అభ్యర్థిని ప్రశ్నించే పరిస్థితుల్లో లేవు. బీజేపీ నుంచి పోటీలో ఉన్న అభ్యర్థి గత ఆరు సంవత్సరాల్లో గ్రాడ్యుయేట్లకుగాని తెలంగాణ రాష్ట్రానికి గాని చేసింది ఏమీ లేదు. న్యాయవాదిగా ఉన్న రాంచంద్ర రావు సత్యాలు కాకుండా అసత్యాలే మాట్లాడుతున్నారు. బీజేపీకి తెలంగాణ రాష్ట్రంలో ఓటు అడిగే నైతిక హక్కు లేదు. తెలంగాణకు చట్టబద్ధంగా దక్కాల్సినవి తప్ప అదనంగా ఒక్క రూపాయి ఇవ్వలేదన్న విషయాన్ని ప్రజల్లోకి తీసుకు పోవాలి. పథకాలకు పైసలు ఇవ్వలేదు, ప్రత్యేక హోదాలు ఇవ్వలేదు, కనీసం మొన్నటికి మొన్న మెడికల్ కాలేజీల కేటాయింపులోనూ మొండిచేయి చూపించింది.బీజేపీ చేస్తున్న అసత్య ప్రచారాన్ని బలంగా తిప్పికొట్టాలి. ఇంత పెద్ద ఎత్తున నిర్భయంగా అసత్యాలను ప్రజల్లోకి తీసుకుపోతున్న ఆ పార్టీ తీరును మనం ప్రజల్లో ఎండగట్టాలి. తెలంగాణలో ఓట్లు అడిగేందుకు బిజెపి వద్ద ఒక్కటంటే ఒక్క కారణం కూడా లేదని కేటీఆర్‌ విమర్శించారు.

గత ఆరు సంవత్సరాల్లో కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడం చేయాలి.పెరిగిన ధరలు ముఖ్యంగా పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలను ప్రతి ఒక్కరికి గుర్తు చేయాలి.మన ప్రభుత్వం గత ఆరు సంవత్సరాలుగా చేపట్టిన పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను మన బాధ్యతగా గ్రాడ్యుయేట్లకు మరోసారి గుర్తు చేయాలి. ముఖ్యంగా యువత, నిరుద్యోగులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి అందించిన అవకాశాలను వివరించాలి. ఉద్యోగాల భర్తీపైన ప్రతిపక్షాల అసత్యాలను దుష్ప్రచారాన్ని బలంగా తిప్పికొట్టాలి. గతంలో ఏ ప్రభుత్వ హయాంలో లేని విధంగా ఇప్పటికీ దాదాపు 1,33,000 ఉద్యోగాలను మనం భర్తీ చేశాం. ఉద్యోగాలు నింపడమే కాదు వాటిని అత్యంత పారదర్శకంగా ఎలాంటి అవినీతికి తావు లేకుండా భర్తీ చేశాం. ప్రభుత్వ ఉద్యోగాలతో పాటు ప్రైవేటు రంగంలోనూ సుమారు 14 లక్షల ఉద్యోగాలను తెలంగాణ రాష్ట్రానికి తీసుకురావడంలో మనం విజయం సాధించాం. ముఖ్యంగా హైదరాబాద్ నగర గ్రాడ్యుయేట్లకు గత ఆరు సంవత్సరాల్లో టిఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను వివరించాలి. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ విధానాలు పరిపాలన వలన హైదరాబాద్ నగరం అభివృద్ధి చెందుతున్న తీరు తద్వారా జరిగిన సానుకూల మార్పును తెలియజేయాలని కేటీఆర్ తెలిపారు.

గత ఆరు సంవత్సరాలు హైదరాబాద్ నగరం భారీ ఎత్తున విస్తరించింది మరియు వేగంగా అభివృద్ధి చెందుతుంది. ప్రభుత్వ ఉద్యోగులు తెరాస ప్రభుత్వానికి వ్యతిరేకం అన్నది దుష్ప్రచారం మాత్రమే. ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో వారంతా మనతో కలిసి పని చేశారు. ప్రభుత్వ ఉద్యోగులతో టీఆర్‌ఎస్‌ది పేగుబంధం. అందుకే దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ ఏర్పాటు కాగానే భారీ పీఆర్సీని మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ప్రకటించారు. ఈ ఎన్నికల కోసం క్షేత్రస్థాయిలో ప్రతి ఒక్కరూ నడుం కట్టాల్సిన అవసరం ఉన్నది. ఓటరుగా నమోదు చేయించుకున్న ప్రతి ఒక్క విద్యావంతులని కలిసి ప్రత్యక్షంగా పార్టీకి మద్దతు అడగాలి. వారితో గత ఆరు సంవత్సరాల్లో మన ప్రభుత్వం చేసిన అభివృద్ధిని పంచుకోవాలి. పార్టీ కోసం నిబద్ధతతో పని చేసే ప్రతి ఒక్క కార్యకర్తకు మంచి గౌరవం దక్కుతుంది. ఈ విషయాన్ని పార్టీ శ్రేణులు దృష్టిలో ఉంచుకోవాలని కేటీఆర్‌ పేర్కొన్నారు.

- Advertisement -