చిగురుపాటి జయరామ్..ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో మార్మోగుతున్న పేరు. ఆయన హత్య తర్వాత రోజుకో నిజం వెలుగుచూస్తుండటంతో అసలు ఎవరు ఈ జయరాం..?ఆయన కుటుంబ నేపథ్యం ఏంటీ..?తక్కువ సమయంలోనే బడా పారిశ్రామిక వేత్తగా ఎలా మారాడు..?అతడు నిర్మించుకున్న సామ్రాజ్యం ఎలా కుప్పకూలింది అన్న సందేహం అందరిలో వెలువడుతోంది.
1990లో డాలర్ డ్రీమ్స్‌తో అమెరికాలో అడుగుపెట్టిన చిగురుపాటి జయరామ్ కృష్ణా జిల్లాలో జన్మించారు. 1993లో అమెరికాలో చిరు ఉద్యోగిగా ప్రస్థానాన్ని ప్రారంభించిన జయరాం.. ఫార్మా, బ్యాంకింగ్, మీడియా ఇలా పలు వ్యాపారాలలో పెట్టుబడులు పెట్టి కోట్ల రూపాయలను ఆర్జించాడు.
పెళ్లి అనంతరం భార్యతో కలిసి అమెరికాలో స్థిరపడ్డ జయరాం ఫార్మా రంగంలో తిరుగులేని పట్టు సాధించారు. కాన్సర్ చికిత్సలో వాడే ఔషధాలు, సంతాన లేమికి వాడే ఔషధాలు, డయాలిసిస్ లో అవసరమయ్యే థెరపటిక్స్ వంటి చాలా మందులకు పేటెంట్లు ఉన్నాయి. ఓ ప్రముఖ ఫార్మా కంపెనీతో తలెత్తిన వివాదాలు…కోర్టు మెట్లెక్కడం..ఆ కేసు జయరాంకు అనుకూలంగా రావడంతో అప్పటినుండి ఆయనకు ఎదురులేకుండా పోయింది.
అప్పటి వరకు పారిశ్రామిక వర్గాల్లో తప్ప పెద్దగా ఎవరికి జయరాం పేరు తెలియదు. విజయవాడ కోస్టల్ బ్యాంక్ టేక్ ఓవర్‌తో తెలుగు రాష్ట్రాల్లో ఆయన పేరు మార్మోగిపోయింది. పారిశ్రామికంగా ఉన్నత స్థానాలను అధిరోహించిన ఆయన నిత్యం వివాదాల్లోనే ఉండేవారు. అంతేగాదు లగ్జరీ లైఫ్‌ను ఎంజాయ్ చేయటంలో జయరాం స్టైలే వేరని టాక్. ఇందుకోసం కోట్ల రూపాయలను వెచ్చించేవారు.
నష్టాల్లో ఉన్న కంపెనీలను వదులుకోవడంలో ఆయన సిద్ధహస్తుడని టాక్.హైదరాబాద్‌లో ఎక్స్‌ప్రెస్ టీవీని స్థాపించడం ఆ తర్వాత నష్టాలు రావడంతో దానిని మూసేశారు. హైదరాబాద్ లో ప్రముఖ కళ్ళజోళ్ల కంపెనీ టెక్ట్రాన్ పరిశ్రమ మూసి వేయడంతో ఉద్యోగులు రోడ్డున పడ్డారు. వాళ్ళు కోర్టుకు వెళ్లడంతో ఏడాది క్రితం జైలుకు వెళ్లాల్సి వచ్చింది.
జయరాం సక్సెస్ వెనుక ఆయన కష్టం,మేథస్సు ఉందనడం ఎంతనిజమో ఆయన దివాళ తీయడానికి మేనకోడలు శిఖా చౌదరి కూడా కారణమనే వార్త వినిపిస్తోంది. జయరామ్ స్థాపించిన అనేక కంపెనీలను శిఖా చౌదరినే నిర్వహిస్తూ వచ్చారు. చెక్ పవర్‌లతో వందల కోట్ల రూపాయలను దుర్వినియోగం చేసిందని టాక్. ఇక జయరాం హత్యకు కుత్బుల్లాపూర్‌లోని టెక్రాన్ సంస్థలో తలెత్తిన వివాదాలే కారణమని తెలుస్తోంది. ఈ క్రమంలో రాకేశ్‌రెడ్డి దగ్గర రూ.2.25కోట్లు, రూ.1.5కోట్లు మొత్తం రూ.4కోట్లు అప్పుగా తీసుకున్నాడు. తర్వాత అమెరికాకు వెళ్లిపోయాడు. ఆ డబ్బు తిరిగి ఇవ్వాలని పలుసార్లు కోరినా జయరాం స్పందించకపోవడం, ఫోన్ కట్ చేయడం, నంబర్ బ్లాక్ చేయడంతో రాకేశ్ కక్ష పెంచుకున్నాడు. చివరికి జయరాంను అంతమొందించే వరకు వెళ్లింది.
ఓవరాల్‌గా ఈ కేసును సక్సెస్‌ఫుల్‌గా చేధించిన పోలీసులు ఈ కేసుతో సంబంధం ఉన్న ఇబ్రహీంపట్నం ఏసీపీ మల్లారెడ్డిని అంబర్‌పేట హెడ్‌క్వార్టర్స్‌కు, నల్లకుంట సీఐ శ్రీనివాస్‌ను కంట్రోల్‌రూమ్‌కు అటాచ్ చేశారు.