బిల్ గేట్స్ దంపతులకు విడాకులు మంజూరు చేసిన కోర్టు..

402
Bill Gates
- Advertisement -

ప్రపంచ కుబేరుల్లో ఒకరైన బిల్ గేట్స్, మెలిందా గేట్స్ తమ 27 ఏళ్ల వివాహ బంధానికి అధికారికంగా ఫుల్ స్టాప్ పెట్టేశారు. తాము విడిపోతున్నట్టు మూడు నెలల క్రితమే వారు ప్రకటించినా.. తాజాగా ఇవాళ కోర్టు విడాకులను మంజూరు చేసింది. వాషింగ్టన్ లోని కింగ్ కౌంటీ కోర్టు జడ్జి వారి వివాహాన్ని రద్దు చేశారు. కాగా, 1987లో మైక్రోసాఫ్ట్ సంస్థ ఏర్పాటు స‌మ‌యంలో వీరిద్ద‌రూ క‌లుసుకున్నారు. 1994లో పెళ్లి చేసుకొని ఒక్కటైయ్యారు.

ఇక విడాకుల ఒప్పందానికి తగ్గట్టు ఆస్తులను పంచుకోవాల్సిందిగా జడ్జి ఆదేశించారు. షరతుల ప్రకారం ఆ వివరాలన్నింటినీ గోప్యంగా ఉంచాలన్నారు. కాగా, విడాకుల విషయం బయటకు వచ్చిన కొన్ని రోజుల్లోనే మెలిందా ఫ్రెంచ్ గేట్స్ పేరిట 300 కోట్ల డాలర్ల విలువైన షేర్లను బిల్ గేట్స్ బదిలీ చేశారు. ప్రస్తుతం గేట్స్ దగ్గర 15,000 కోట్ల డాలర్ల సంపద ఉంది. ఆ ఆస్తులను ఎలా విభజిస్తారన్న దానిపై ప్రస్తుతం స్పష్టత లేదు.

50 బిలియ‌న్ డాల‌ర్ల గేట్స్ ఫౌండేష‌న్‌ను మాత్రం ఇద్ద‌రూ క‌లిసి మ‌రో రెండేళ్ల పాటు సంయుక్తంగా న‌డ‌ప‌నున్న‌ట్లు కోర్టు డాక్యుమెంట్ల ద్వారా తెలుస్తోంది. మెలిండా ఫ్రెంచ్‌ గేట్స్ విడాకులు కోసం వాషింగ్ట‌న్ కౌంటీ కోర్టులో ద‌ర‌ఖాస్తు చేసుకున్నారు. బిల్ గేట్స్ వ‌య‌సు 65 ఏళ్లు. మెలిండా వ‌య‌సు 56 ఏళ్లు. వాషింగ్టన్ రాష్ట్రం చట్టాల ప్రకారం.. పెళ్లి తర్వాత సంపాదించిన దాంట్లో దంపతులిద్దరికీ సమాన వాటా ఉంటుంది. దాని ప్రకారం ఆస్తిని న్యాయప్రకారం సమానంగా పంచాలని జడ్జి ఆదేశించారు.

- Advertisement -