BB10:బిగ్ బాస్ కెప్టెన్సీ కోసం రచ్చ

5
- Advertisement -

బిగ్ బాస్ హౌస్‌లో రోజురోజుకూ వాతావరణం వేడెక్కుతోంది. ముఖ్యంగా కెప్టెన్సీ కంటెండర్ల టాస్క్ మొదలైనప్పటి నుంచి కంటెస్టెంట్లు హద్దులు దాటి ప్రవర్తిస్తున్నారు. ఫిజికల్ టాస్క్‌ల పేరిట ఒకరిపై ఒకరు పడిపోవడం, బట్టలు చించుకోవడం లాంటి ఘటనలు ప్రేక్షకులను ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. ఈ మొత్తం గొడవల్లో ప్రధానంగా త్రిగుణ్ టార్గెట్ అవుతున్నాడనే ప్రచారం ఊపందుకుంది.

‘చిక్కకు-దొరకకు’ టాస్క్‌లో కెప్టెన్సీ కంటెండర్లుగా ఉన్న త్రిగుణ్, ఝాన్సీ, రాం ప్రసాద్, షాలినీ, ముఖేష్‌లను జైలు గోడ దాటకుండా మిగతా హౌస్‌మేట్స్ నిరోధించాల్సి వచ్చింది. ఈ క్రమంలో పోటీ తీవ్ర స్థాయికి చేరింది. రోహిత్ ఇప్పటికే రాం ప్రసాద్‌ను ఎత్తి అవతల పారేయడం, త్రిగుణ్ ముఖానికి గాయం అయ్యేలా ఆడటం విమర్శలకు దారితీసింది. తాజాగా విడుదలైన ప్రోమోలో త్రిగుణ్ టీ-షర్ట్ పూర్తిగా చరిగిపోవడం, ముఖేష్ అతని మెడను గట్టిగా పట్టుకోవడం కనిపించింది. ముఖేష్ కావాలనే కసితో త్రిగుణ్‌పై భౌతిక దాడికి దిగాడనే వ్యాఖ్యలు వ్యక్తమవుతున్నాయి.

మరోవైపు, త్రిగుణ్ కూడా తక్కువేమీ తినలేదని ఇంట్లోని వారి అభిప్రాయం. టాస్కుల్లో హద్దులు దాటడమే కాకుండా, మైండ్ గేమ్ ఆడటంలో త్రిగుణ్ రూటు మార్చాడు. నిన్నటి వరకు రోహిత్‌తో గొడవపడిన త్రిగుణ్, సడన్‌గా అతని దగ్గరకు వెళ్లి సంధి కుదుర్చుకున్నాడు. “మనిద్దరం కలిస్తే తిరుగుండదు, మనం గొడవపడితే సైలెంట్‌గా ముఖేష్ ముందుకు వెళ్తాడు” అంటూ రోహిత్‌తో చేతులు కలిపాడు. తన స్వార్థం కోసం ఎంతకైనా దిగజారతాడని, నక్క బుద్ధి చూపిస్తున్నాడని ముఖేష్ వేరే కంటెస్టెంట్లతో ఆవేదన వ్యక్తం చేశాడు.

కెప్టెన్సీ రేస్ నుంచి తనను తప్పించిన ముఖేష్‌పై త్రిగుణ్ పగబట్టినట్టు కనిపిస్తోంది. ముఖేష్ ముందు తొడకొడుతూ “ఓడిపోయినా ఈ సింహం సింహామే.. దమ్ముంటే ఎదురురా” అంటూ ప్రోమోలో ఘాటుగా రెచ్చగొట్టాడు. అయితే ముఖేష్ మాత్రం సైలెంట్‌గా ఉంటూనే, “వాడిలా గేమ్ ఆడాలంటే ఎంతసేపు, నాకు ఆ డబుల్ గేమ్ వచ్చు” అని దేబ్జానీ, రాం ప్రసాద్‌లకు వివరించాడు. తన బెలూన్లు పగలగొట్టాడనే కోపంతో వర్షిణి దగ్గర కూడా త్రిగుణ్ పిచ్చిగా ఫీల్ అయినట్లు చూపించారు.

ఈ కెప్టెన్సీ రచ్చ మధ్యలోనే షాలినీ, వర్షిణి మధ్య వయస్సు సంబంధిత వ్యాఖ్యలపై పెద్ద యుద్ధమే నడిచింది. 30 ఏళ్లు దాటిన వారే రావలనే కండీషన్ పెట్టండి అంటూ షాలినీ వర్షిణిపై ఫైర్ అయింది. అలాగే ముఖేష్, వర్షిణి, సుధీర్ గ్రూప్ గేమ్ ఆడుతున్నారని షాలినీ నిలదీసింది.

Also Read:‘ది ప్యారడైజ్’..ఎంజాయ్ చేస్తారు

మొత్తానికి, బిగ్ బాస్ హౌస్ ఫిజికల్ టాస్క్‌లు, గ్రూపిజం, రివెంజ్ గేమ్‌లతో తీవ్ర ఉద్రిక్తతలకు వేదికగా మారింది. రానున్న ఎపిసోడ్లలో ఈ గొడవలు ఎక్కడికి దారితీస్తాయో చూడాలి!

- Advertisement -