బిగ్‌బాస్ తెలుగు సీజన్ 10లో ఎనిమిదో వారం అనూహ్య పరిణామాలతో ముగిసింది. ఆదివారం (నవంబర్ 1) ప్రసారమైన ఎపిసోడ్‌లో డబుల్ ఎలిమినేషన్ చోటుచేసుకుంది. ప్రేక్షకుల ఓట్ల ఆధారంగా ఝాన్సీ ఎలిమినేట్ కాగా.. ఇంటి సభ్యుల మెజారిటీ నిర్ణయంతో రోహిత్ హౌస్ నుంచి బయటకు వెళ్లాల్సి వచ్చింది. అయితే రోహిత్ ఎలిమినేషన్ వెనుక త్రిగుణ్ చూపించిన ఒక్క వీడియో కీలకంగా మారిందనే చర్చ జరుగుతోంది. ముఖ్యంగా చివరి నిమిషంలో నరేష్, రాం ప్రసాద్, అమన్ తమ నిర్ణయాన్ని మార్చుకున్నట్లు కనిపించింది.
ఎలిమినేషన్ అనంతరం స్టేజ్‌పైకి వచ్చిన ఝాన్సీ తన బిగ్‌బాస్ జర్నీని చూసుకుని భావోద్వేగానికి గురైంది. అనంతరం నాగార్జున ఆమెకు సామెతలతో కూడిన ఆసక్తికరమైన టాస్క్ ఇచ్చారు. ఇందులో కంటెస్టెంట్ల ఆటతీరును ఉద్దేశించి ఝాన్సీ తన అభిప్రాయాలను వెల్లడించింది. త్రిగుణ్‌కు ‘గోరంత దాన్ని కొండంత చేస్తాడు’, ముకేష్‌కు ‘మెరిసేదంతా బంగారం కాదు’, నరేష్‌కు ‘ఇంట్లో పులి.. వీధిలో పిల్లి’ అనే సామెతలు సరిపోతాయని చెప్పింది.
ఆ తర్వాత ‘చేదు నిజాలు’ టాస్క్‌లో కంటెస్టెంట్లు ఒకరిపై మరొకరు తమ అభిప్రాయాలను వెల్లడించారు. ఈ సందర్భంగా త్రిగుణ్, వర్షిణి మధ్య ఆసక్తికరమైన సంభాషణ జరిగింది. అనంతరం పాటలను సైగల ద్వారా గుర్తించే ఆటలో నరేష్ టీమ్ విజయం సాధించింది.
Also Read:ఇట్లు అర్జున..నవంబర్ 13న
ఇక అసలు ట్విస్ట్ రెడ్ జోన్‌లో ఉన్న శ్వేత, ఆర్కే, రోహిత్‌ల ఎలిమినేషన్ సమయంలో చోటుచేసుకుంది. వీరిలో ఒకరిని ఇంటి సభ్యుల ఓట్లతో బయటకు పంపిస్తామని నాగార్జున ప్రకటించారు. ఈ క్రమంలో త్రిగుణ్.. కన్‌ఫెషన్ రూమ్‌లో చూసిన వీడియో గురించి అమన్, నరేష్, రాం ప్రసాద్‌లకు వివరించాడు. రోహిత్ తమ గురించి అసభ్యంగా మాట్లాడాడని చెప్పడంతో వారి అభిప్రాయం మారినట్లు కనిపించింది.
ముకేష్, వర్షిణి, సుధీర్, నీతూ మాత్రమే రోహిత్‌కు మద్దతుగా నిలిచారు. మిగిలిన ఏడుగురు రోహిత్‌కు వ్యతిరేకంగా ఓట్లు వేయడంతో అతడు ఎలిమినేట్ అయ్యాడు. స్టేజ్‌పైకి వచ్చిన రోహిత్ తనపై ఓట్లు వేసిన సభ్యులతో మాట్లాడి వీడ్కోలు పలికాడు. ఇక తొమ్మిదో వారం ‘రివార్డ్ అండ్ రివేంజ్’ థీమ్‌తో సాగనుందని నాగార్జున ప్రకటించారు.

