బిగ్‌బాస్ తెలుగు సీజన్ 10లో ఏడో వారం డబుల్ ఎలిమినేషన్‌తో ఆదివారం ఎపిసోడ్ ఆసక్తికరంగా సాగింది. 50వ ఎపిసోడ్లో దక్షి, షాలినీ హౌస్ నుంచి బయటకు వచ్చారు. ముందుగా ప్రేక్షకుల ఓట్ల ఆధారంగా దక్షి ఎలిమినేట్ కాగా, ఆ తర్వాత హౌస్‌లోని గ్రీన్, ఎల్లో జోన్ కంటెస్టెంట్ల నిర్ణయంతో షాలినీ ప్రయాణం ముగిసింది. అయితే ఇంటి నుంచి వెళ్లే చివరి క్షణాల్లో రోహిత్, షాలినీ మధ్య ప్రేమ వ్యవహారం మరోసారి హాట్ టాపిక్‌గా మారింది.
ఎపిసోడ్ ప్రారంభంలో నాగార్జున.. నామినేషన్లలో ఉన్న వర్షిణి, శివ్ సురక్షితంగా ఉన్నట్లు ప్రకటించారు. అనంతరం నిర్వహించిన ‘ఫిక్షనరీ టు డిక్షనరీ’ టాస్క్‌లో సుధీర్ టీమ్ విజయం సాధించింది. సినిమా పేర్లను బొమ్మల ద్వారా గుర్తించే ఈ ఆటలో ఆర్కే టీమ్ వెనుకబడింది. ఆ తర్వాత దక్షి ఎలిమినేషన్ జరిగింది.
స్టేజ్‌పైకి వచ్చిన దక్షి తన బిగ్‌బాస్ ప్రయాణాన్ని చూసుకుని హౌస్‌మేట్స్‌కు పలు సూచనలు చేసింది. నీతూ ఎక్కువగా వినాలని, అమన్ ఇతరులను గమనించాలని, త్రిగుణ్ తన మాటలపై నియంత్రణ పాటించాలని సలహా ఇచ్చింది. శ్వేతకు కూడా తన ఆటతీరును మార్చుకోవాలని సూచించింది.
ఆ తర్వాత ఎలిమినేషన్ ప్రక్రియలో ఎల్లో జోన్‌లోని కంటెస్టెంట్లు శివ్, రాంప్రసాద్, వర్షిణి, నరేష్ వరుసగా శ్వేత, ఝాన్సీ, సుధీర్, వంశీలను సేఫ్ చేశారు. మిగిలిన రోహిత్, షాలినీ, ఆర్కేలో ఎవరిని బయటకు పంపాలనే నిర్ణయం గ్రీన్ జోన్ కంటెస్టెంట్ల చేతుల్లో పెట్టారు. చివరకు షాలినీకి ఎగ్జిట్ బ్యాడ్జ్ దక్కడంతో ఆమె హౌస్‌ను వీడాల్సి వచ్చింది.
Also Read:BB10:గేమ్ ఛేంజర్‌గా ముకేశ్
అయితే షాలినీ వెళ్లే సమయంలో రోహిత్‌తో భావోద్వేగ క్షణాలు చోటుచేసుకున్నాయి. గేటు దగ్గర కూడా ఆమెను వెనక్కి పిలిచి రోహిత్ హగ్ ఇచ్చాడు. షాలినీ అతడి చెవిలో ఐ లవ్ యూ అని చెప్పింది. బయటకు వెళ్లిన తర్వాత కూడా తనకు రోహిత్ విజేతగా నిలవాలని ఉందని షాలినీ తెలిపింది.

