తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించిన తరువాత సిఎం పదవి ఎవరిని వరిస్తుందనే చర్చ గట్టిగానే జరిగింది. ఎట్టకేలకు సుధీర్ఘ చర్చల తరువాత ఎట్టకేలకు రేవంత్ రెడ్డినే సిఎంగా ప్రకటించింది హస్తం హైకమాండ్. రేపు తెలంగాణ రెండో సిఎంగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ప్రకటించిన హామీలపై కొత్త చర్చ రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. ముఖ్యంగా ఆరు గ్యారెంటీల పేరుతో ప్రజలను ఆకర్షించి విజయం సొంతం చేసుకున్న కాంగ్రెస్ వాటి అమలుకు ఎలాంటి ప్రణాళికలు వేయబోతుందనేది ఆసక్తికరంగా మారింది. ఆరు గ్యారెంటీ హామీలను కచ్చితంగా అమలు చేస్తామని చెబుతున్న హస్తం పార్టీ.. వాటిని ఒకేసారి అమలు చేస్తారా ? లేదా దశల వారీగా వాటిపై దృష్టి పెడతారా ? అనేది ఆసక్తికరంగా మారిన అంశం. .
అయితే ప్రమాణస్వీకారం రోజునే ఆరు గ్యారెంటీ హామీలపై సంతకం చేస్తామని గతంలో రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించిన సంగతి విధితమే. ఈ నేపథ్యంలో రేపు ప్రమాణ స్వీకారం చేయనున్న రేవంత్ రెడ్డి ఆరు గ్యారెంటీ హామీలపై రేపే సంతకం చేసే అవకాశం ఉందా అనే చర్చ జరుగుతోంది. ఒకవేళ రేపు సంతకం చేసిన వాటి అమలు వెంటనే జరుగుతుందా అనే సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి. సిఎం పదవి రేవంత్ రెడ్డి చేతిలో ఉన్నప్పటికి వాటి అమలు మాత్రం అధిష్టానం అనుమతి మేరకే జరుగుతుంది. ఈ నేపథ్యంలో హామీల అమలుకు అధిష్టానం ఎంతమేర ముందడుగు వేస్తుందనేది ప్రశ్నార్థకమే. కర్నాటకలో కూడా గ్యారెంటీ హామీలు ప్రకటించినప్పటికి వాటి అమలులో మాత్రం జాప్యం జరుగుతోందని ఆ రాష్ట్ర ప్రజలు వాపోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. మరి తెలంగాణలో కూడా ఇదే పరిస్థితి నెలకొనే అవకాశం ఉందా ? అనే ప్రశ్నలు కూడా రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్నాయి. మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారెంటీల విషయంలో ఎలా అడుగులు వేస్తుందో చూడాలి.
Also Read:పిక్ టాక్:మతిపోగొట్టేలా గ్లామర్ ట్రీట్