దళపతి విజయ్ అభిమానులకు మద్రాస్ హైకోర్టు నుంచి భారీ ఊరట లభించింది. విజయ్ నటిస్తున్న తాజా చిత్రం ‘జన నాయగన్’ కు సంబంధించి కీలక తీర్పును హైకోర్టు వెల్లడించింది. ఈ సినిమాకు తక్షణమే సెన్సార్ సర్టిఫికేట్ జారీ చేయాలని కేంద్ర చలనచిత్ర ధ్రువీకరణ మండలి (CBFC)కి మద్రాస్ హైకోర్టు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.
‘జన నాయగన్’ సినిమా సెన్సార్ ప్రక్రియ ఆలస్యం కావడంతో చిత్ర యూనిట్ కోర్టును ఆశ్రయించింది. అనవసర జాప్యం వల్ల సినిమా విడుదలపై అనిశ్చితి ఏర్పడిందని పిటిషన్‌లో పేర్కొన్నారు. దీనిపై విచారణ చేపట్టిన హైకోర్టు, చట్టపరమైన నిబంధనలను పాటిస్తూ సెన్సార్ ప్రక్రియను వేగవంతం చేయాల్సిన బాధ్యత CBFCపై ఉందని వ్యాఖ్యానించింది. ఆలస్యం వల్ల నిర్మాతలకు ఆర్థిక నష్టం కలగడమే కాకుండా ప్రేక్షకుల్లో అయోమయం ఏర్పడుతుందని కోర్టు అభిప్రాయపడింది.
అన్ని విధాలా పరిశీలించిన అనంతరం, ఎలాంటి అనవసర ఆలస్యం లేకుండా ‘జన నాయగన్’ చిత్రానికి వెంటనే ఫిల్మ్ సర్టిఫికేట్ జారీ చేయాలని హైకోర్టు ఆదేశించింది. ఈ తీర్పుతో సినిమా విడుదలకు అడ్డంకులు తొలగినట్లయింది. దీంతో విజయ్ అభిమానుల్లో ఆనందం వెల్లువెత్తుతోంది. త్వరలోనే ‘జన నాయగన్’ ప్రేక్షకుల ముందుకు రానుందని సినీ వర్గాలు భావిస్తున్నాయి. ఈ సినిమా విజయ్ కెరీర్‌లో మరో కీలక మైలురాయిగా నిలవనుందని అభిమానులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
Also Read:అగ్రికల్చర్ యూనివర్సిటీలో ప్రశ్నాపత్రం లీక్!

