కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీకి పరువునష్టం కేసులో ఊరట లభించింది. కేంద్ర హోంమంత్రి అమిత్ షాపై 2018లో చేసిన వ్యాఖ్యలకు సంబంధించి నమోదైన క్రిమినల్ పరువునష్టం కేసులో ఉత్తరప్రదేశ్‌లోని సుల్తాన్‌పూర్ ప్రత్యేక ఎంపీ/ఎమ్మెల్యే కోర్టు సోమవారం ఆయనను నిర్దోషిగా ప్రకటించింది. అమిత్ షాపై రాహుల్ చేసిన వ్యాఖ్యలు పరువునష్టం కిందకు రావని కోర్టు పేర్కొన్నట్లు వార్తా కథనాలు వెల్లడించాయి.
2018లో కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ప్రచార సమయంలో బెంగళూరులో జరిగిన సభలో అప్పటి బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాపై రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు వివాదానికి దారితీశాయి. ఆ వ్యాఖ్యలు అమిత్ షా ప్రతిష్ఠకు భంగం కలిగించాయని ఆరోపిస్తూ బీజేపీ నేత విజయ్ మిశ్రా అదే ఏడాది ఆగస్టు 4న రాహుల్‌పై పరువునష్టం ఫిర్యాదు చేశారు.
ఈ కేసులో భారత శిక్షాస్మృతిలోని 499, 500 సెక్షన్ల కింద చర్యలు కోరారు. రాహుల్ గాంధీ 2023లో కోర్టుకు హాజరయ్యారు. అనంతరం 2024 ఫిబ్రవరిలో బెయిల్ పొందారు. కేసులో విచారణ పూర్తయిన తర్వాత కోర్టు తీర్పును తొలుత అక్టోబర్ 13న వెలువరించాలని నిర్ణయించినప్పటికీ, ఆ తేదీని అక్టోబర్ 26కు మార్చింది.
Also Read:TTD:తిరుమలలో భక్తుల రద్దీ
తీర్పు వెలువడే సమయంలో రాహుల్ గాంధీ స్వయంగా సుల్తాన్‌పూర్‌లోని ప్రత్యేక ఎంపీ/ఎమ్మెల్యే కోర్టుకు హాజరయ్యారు. ఆయన తరఫున సీనియర్ న్యాయవాది ఆర్.ఎస్. చీమా సహా న్యాయవాదుల బృందం వాదనలు వినిపించింది. కోర్టు తీర్పును ఉత్తరప్రదేశ్ కాంగ్రెస్ స్వాగతించింది.

