రాజ్యసభ ఎంపీ రాఘవ్ చద్దాకు న్యాయస్థానంలో భారీ ఉపశమనం లభించింది. సోషల్ మీడియా మరియు డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లలో ఆయన ప్రతిష్టకు భంగం కలిగించే విధంగా ఉన్న పోస్టులు, వీడియోలు మరియు కంటెంట్‌ను తక్షణమే తొలగించాలని ఢిల్లీ హైకోర్టు బుధవారం సంచలన ఆదేశాలు జారీ చేసింది.
రాఘవ్ చద్దా వ్యక్తిగత మరియు రాజకీయ జీవితాన్ని లక్ష్యంగా చేసుకుని…ఎలాంటి ఆధారాలు లేకుండా కొన్ని వెబ్‌సైట్లు మరియు సోషల్ మీడియా ఖాతాలలో తప్పుడు ప్రచారాలు సాగిస్తున్నారని ఆయన తరఫు న్యాయవాదులు కోర్టు దృష్టికి తీసుకువెళ్లారు. దీనివల్ల ఆయన ప్రతిష్ట తీవ్రంగా దెబ్బతింటోందని వాదించారు.
ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన ఢిల్లీ హైకోర్టు ఏకసభ్య ధర్మాసనం.. ప్రాథమిక ఆధారాలను పరిశీలించిన తర్వాత రాఘవ్ చడ్డాకు అనుకూలంగా తీర్పునిచ్చింది.ప్రజాప్రతినిధులపై ఆధారాలు లేని ఆరోపణలు చేయడం, వారి వ్యక్తిగత జీవితాన్ని కించపరచడం భావప్రకటన స్వేచ్ఛ కిందకు రాదని కోర్టు స్పష్టం చేసింది.సదరు గౌరవభంగకరమైన లింకులు, పోస్టులను ఇంటర్నెట్ నుండి తొలగించాలని సంబంధిత సోషల్ మీడియా సంస్థలను (ఎక్స్, యూట్యూబ్, గూగుల్ మొదలైనవి) ఆదేశించింది.
Also Read:డిజిటల్ ఇండియా..11 ఏళ్ల ప్రస్థానం!
కోర్టు ఇచ్చిన ఈ ఆదేశాలపై రాఘవ్ చడ్డా హర్షం వ్యక్తం చేశారు. నిజాయితీకి, న్యాయానికి దక్కిన విజయంగా దీనిని అభివర్ణించారు. రాజకీయంగా ఎదుర్కొనలేకనే ప్రత్యర్థులు ఇలాంటి తప్పుడు ప్రచారాలకు తెరలేపుతున్నారని ఆప్ వర్గాలు పేర్కొన్నాయి.

