తప్పుడు చిరునామా పత్రాలు సమర్పించి రూ.20 లక్షల పన్ను ఎగ్గొట్టిన కేసులో హీరోయిన్ అమలాపాల్‌కు ఊరట లభించింది. కేరళ హైకోర్టు ఈ రోజు రూ.లక్ష పూచీకత్తుతో ఆమెకు బెయిల్ మంజూరు చేసింది. పోలీసుల విచారణకు సహకరించాలని ఆదేశించింది.
కేరళలో నివసిస్తూ పుదుచ్చేరిలో ఉంటున్నట్టు తప్పుడు చిరునామా పత్రాన్ని చూపి లగ్జరీ కారు కొన్నదంటూ అమలాపాల్‌పై పలు ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. రూ.20 లక్షలు ఎగ్గొట్టి చట్ట వ్యతిరేక చర్యలకు పాల్పడిన అమలాపాల్‌పై చర్యలు తీసుకోవాలని పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్ బేడి అప్పట్లో ఆదేశించారు. దీనిపై కేరళ పోలీసులు అమలాపాల్‌పై పన్ను ఎగవేత కేసుని నమోదు చేశారు.
అయితే అమలా పాల్ హైకోర్టులో ముందస్తు బెయిల్ దాఖలు చేసుకుంది. కానీ తొలుత పోలీస్ స్టేషన్‌లో లొంగిపోవాలని అప్పుడు బెయిల్ గురించి ఆలోచిస్తామని న్యాయవాది స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో తిరువనంతపురంలోని క్రైమ్ బ్రాంచ్ పోలీసుల వద్ద లొంగిపోగా ఇవాళ కేరళ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. అమలా పాల్ నటించిన ‘భాస్కర్ ఒరు రాస్కెల్’ త్వరలో విడుదల కానుంది.