తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. న్యూ ఇయర్ సందర్భంగా దేశం నలుమూలల నుంచి వేలాదిగా భక్తులు తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి దర్శనానికి తరలివస్తున్నారు. గోవింద నామస్మరణతో ఆలయ ప్రాంగణం మారుమోగుతోంది. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని టీటీడీ విస్తృత ఏర్పాట్లు చేపట్టింది. దర్శనాలు సజావుగా సాగేందుకు అదనపు క్యూలైన్లు, తాగునీరు, అన్నప్రసాద వితరణ వంటి సౌకర్యాలను కల్పించింది.
మరోవైపు తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనాలు కొనసాగుతున్నాయి. భక్తులు వైకుంఠ ద్వారం గుండా స్వామివారిని దర్శించుకునేందుకు పెద్ద సంఖ్యలో హాజరవుతున్నారు. రేపటి నుంచి టోకెన్లు లేని భక్తులకు కూడా ఉత్తర ద్వార దర్శనానికి అనుమతి ఇవ్వనున్నట్లు టీటీడీ అధికారులు తెలిపారు. దీంతో మరింత మంది భక్తులకు స్వామివారి దర్శన భాగ్యం కలగనుంది.
ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కుటుంబ సభ్యులతో కలిసి తిరుమలలో శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. దర్శనానంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, రెండు తెలుగు రాష్ట్రాలు సుభిక్షంగా, సంతోషంగా, ఆర్థికంగా బలంగా అభివృద్ధి చెందాలని స్వామివారిని ప్రార్థించినట్లు తెలిపారు. అలాగే తెలంగాణ రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధి సాధించి, ప్రజల ఆశయాలకు అనుగుణంగా మరింత ప్రగతిపథంలో ముందుకు సాగాలని ఆకాంక్షించారు. స్వామివారి ఆశీస్సులతో రాష్ట్ర ప్రజలకు మేలు జరుగాలని భట్టి విక్రమార్క పేర్కొన్నారు.
Also Read:జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాలు

