సిగాచీ పేలుడు..బాధితుల పరిహారం వివరాలేవి?

4
- Advertisement -

సిగాచీ పరిశ్రమలో జరిగిన ఘోర పేలుడు ఘటనకు సంబంధించి బాధితులకు చెల్లించాల్సిన పరిహారం వివరాలను సమర్పించాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. ఈ ఘటనలో బాధితులకు తగిన పరిహారం అందించాలని కోరుతూ సైంటిస్ట్ బాబూరావు హైకోర్టులో ప్రజాహిత వ్యాజ్యం (పిల్) దాఖలు చేశారు.

ఈ కేసు విచారణ సందర్భంగా అడ్వకేట్ జనరల్ రజినీకాంత్ రెడ్డి కోర్టుకు వివరాలు వెల్లడించారు. సిగాచీ కంపెనీ సీఈఓ అమిత్ రాజ్‌ను ఇప్పటికే అరెస్టు చేశామని, ఈ కేసులో మరో ఐదుగురు నిందితులు పరారీలో ఉన్నారని తెలిపారు. ఇప్పటి వరకు ప్రభుత్వం తరఫున బాధితులకు మొత్తం రూ.22 కోట్ల పరిహారం చెల్లించినట్లు కోర్టుకు తెలియజేశారు.

అదేవిధంగా సిగాచీ కంపెనీ తరఫు లాయర్‌ మాట్లాడుతూ, బాధిత కుటుంబాలకు కంపెనీ తరఫున ఒక్కో కుటుంబానికి రూ.కోటి చొప్పున పరిహారం అందజేసినట్లు కోర్టుకు వివరించారు. కేసు పూర్వాపరాలను పరిశీలించి సిగాచీ సీఈఓ అమిత్ రాజ్‌కు బెయిల్ మంజూరు చేయాలని కంపెనీ తరఫు న్యాయవాది నిరంజన్ రెడ్డి కోర్టును అభ్యర్థించారు.

ఇరు పక్షాల వాదనలు విన్న హైకోర్టు తదుపరి విచారణను జనవరి 29కి వాయిదా వేసింది. సిగాచీ పరిశ్రమలో జరిగిన ఈ పేలుడు ఘటనలో మొత్తం 54 మంది మృతి చెందగా, 8 మంది గల్లంతయ్యారు. మరో 28 మంది తీవ్ర గాయాలతో ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర విషాదాన్ని కలిగించింది.

Also Read:జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాలు

- Advertisement -