దీపికా సినిమా షూటింగ్‌పై దాడి..ఖండించిన తారలు

205
Padmavati
- Advertisement -

బాలీవుడ్ దర్శకుడు సంజయ్‌లీలా భన్సాలీపై, రాజ్‌పుత్‌ కర్ణి సేన కార్యకర్తల దాడి సినీ ఇండస్ట్రీలో తీవ్ర కలకలం సృష్టించింది. రాజస్థాన్‌లోని జయపురలో జయ్‌గఢ్‌ కోట వద్ద చారిత్రక సినిమా ‘పద్మావతి’ షూటింగ్ జరుగుతుండగా..రాజ్‌పుత్‌ కర్ణి సేన కార్యకర్తలు చిత్ర యూనిట్‌ పై దాడి చేశారు . దర్శకుడు సంజయ్‌లీలా భన్సాలీని చెంపదెబ్బకొట్టి, జుట్టుపట్టి ఈడ్చారు. యూనిట్ పై జరిగిన ఈ దాడిని బాలీవుడ్‌ నిర్మాతల సంఘంతో పాటు.. బాలీవుడ్ తారలు తీవ్రంగా ఖండించారు. దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్‌ చేశారు. హృతిక్‌ రోషన్‌, అనుష్క శర్మ, సోనమ్‌ కపూర్‌, ఆలియా భట్‌, కరణ్‌ జొహార్‌, ఫర్హాన్‌ అక్తర్‌, రిషి కపూర్‌, ప్రియాంక చోప్రా, ప్రీతీ జింతా, సోహా అలీఖాన్ తో పాటు ప‌లువురు సినీ ప్రముఖులు ఈ దాడిని తీవ్రంగా ఖండిస్తున్న‌ట్లు ట్వీట్లు చేశారు. ఇటువంటి సమయాల్లోనే ఇండస్ట్రీ ఐక్యంగా ఉండాలని పేర్కొన్నారు. ఇందులో దీపికా పదుకోన్, రన్‌వీర్ సింగ్, షాహిద్ కపూర్ ముఖ్యపాత్రలో నటిస్తున్నారు.

padmavati

క్రియేటివ్‌ కళాకారుల జీవితాలు గాజు మేడల్లా తయారయ్యాయని ఆయన ఆదేదన వ్యక్తం చేశారు బాలీవుడ్‌ ప్రొడ్యూసర్స్‌ గిల్ట్‌ అధ్యక్షుడు విక్రం భట్‌. బాలీవుడ్‌ మొత్తం సంజయ్‌లీలాకు బాసటగా నిలుస్తుందని చెప్పారు. ఇకపై ఇలాంటి ఘటనలు (షూటింగ్‌లపై దాడులు) జరగకుండా ఉండటానికి ఏం చేస్తే బాగుంటుందో అర్థం కావడంలేదని  విక్రం భట్‌ స్పందించారు.

భన్సాలీపై దాడిని బాలీవుడ్ సినీ తారలు..నిర్మాతలు ఖండించగా.. రాజ్‌పుత్‌ సేన మాత్రం సంజయ్‌ లీలాపై ఎదురుదాడిని కొనసాగించింది. ‘ఆయన సినిమాలన్నీ చరిత్ర వక్రీకరణలే’అని ఆరోపించింది. రాజ్‌పుత్‌ కర్ణి సేన వ్యవస్థాపకుడు లోకేంద్ర సింగ్‌ కల్వీ శనివారం ఉదయం మీడియాతో మాట్లాడుతూ.. తమ పూర్వీకుల చరిత్రను వక్రీకరిస్తే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. ‘సంజయ్‌లీలాకు ఎంత దమ్ముంటే మా సొంత గడ్డమీద, మా పూర్వీకులకు సంబంధించిన చరిత్రను వక్రీకరిస్తూ సినిమా తీస్తాడు? జర్మనీలో హిట్లర్‌కు వ్యతిరేకంగా సినిమా తీసే దమ్ముందా ఈయనకి? ‘పద్మావతి’ సినిమాలో రాజ్పుట్ల వంశానికి చెందిన రాణి పద్మినిని అగౌరవపరిచేలా చిత్రీకరిస్తున్నారు. ఒక్క పద్మావతేకాదు.. ఆయన సినిమాలన్నీ చరిత్ర వక్రీకరణలే. గతంలో ‘జోధా అగ్బర్‌’లోనూ జోధాబాయి చరిత్రను తప్పుగా చూపించారు. అందుకే ఆయనకు బుద్ధిచెప్పాలనుకున్నా. చెప్పాం..’ అని లోకేంద్ర సింగ్‌ కల్వీ వివరించారు.

padmavati

హోం మంత్రి ఏమన్నారంటే: ‘పద్మావతి’ యూనిట్‌పై రాజ్‌పుత్‌ కర్ణి సేన దాడిపై రాజస్థాన్‌ హోం మంత్రి జి.సి.కటారియా స్పందించారు. మనోభావాలు దెబ్బతిన్న సందర్భంలో నిరసన తెలిపే హక్కు ఎవరికైనా ఉంటుందని, అయితే చట్టాన్ని ఉల్లంఘించేలా ప్రవర్తించడం గర్హనీయమని మంత్రి అన్నారు. దాడి ఘటనపై విచారణకు ఆదేశించామని, బాధ్యులపై చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఇదిలాఉంటే, నిన్నటి దాడి అనంతరం పోలీసులు అదుపులోకి తీసుకున్న ఐదుగురు శనివారం ఉదయం విడుదలయ్యారు.

https://youtu.be/eaKV97CGUkg

- Advertisement -