తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాలలో ముందజలో ఉంది. రాష్ట్రం అభివృద్ది పథంలో దూసుకుపోతుంది. ఈ నేపథ్యంలో రాష్ట్రనికి మరో అరుదైన గౌరవం దక్కింది. ఈ-గవర్నెన్స్ ద్వారా ప్రభుత్వ పథకాలను ప్రజలకు మరింత చేరువ చేస్తున్నందుకుగాను 2020 ఏడాదికిగాను రాష్ట్రానికి స్కోచ్ గ్రూప్ ‘ఈ-గవర్నెన్స్ స్టేట్ ఆఫ్ ది ఇయర్’ అవార్డు లభించింది. అదేవిధంగా ఐటీ మంత్రిగా ఉత్తమ పనితీరుకు రాష్ట్ర ఐటీశాఖ మంత్రి కేటీఆర్‌ను స్కోచ్ ‘బెస్ట్ ఫెర్మార్మింగ్ ఐటీ మినిస్టర్’ అవార్డు వరించింది. 2016లో సైతం మంత్రి కేటీఆర్ స్కోచ్ ర్యాంకింగ్స్‌లో చోటు దక్కించుకున్నారు. దేశంలోనే రెండు సార్లు స్కోచ్ అవార్డు దక్కించుకున్న ఐటీశాఖ మంత్రిగా కేటీఆర్ రికార్డు నెలకొల్పారు. కొవిడ్-19 సంక్షోభంలోనూ మెరుగైన ప్రజా సేవలు అందించేందుకు తెలంగాణ ఆధునిక సాంకేతికను విరివిగా వినియోగించుకుంది.
సాంఘిక, ఆర్థిక సమస్యలతో వ్యవహరించే స్కోచ్ గ్రూప్ భారతదేశంలోనే ప్రముఖ థింక్ ట్యాంక్. ఫైనాన్స్, టెక్నాలజీ, ఎకనామిక్స్, సాంఘికరంగాల్లో అత్యున్నత స్వతంత్ర పౌర పురస్కారాలను ఏర్పాటు చేసి ఆయా రంగాల్లో విశేష కృషి చేసిన వారికి అందిస్తుంది. భారత్‌ను మరింత మెరుగైన దేశంగా మార్చేందుకు కృషి చేస్తున్న ప్రజలు, ప్రాజెక్ట్స్, సంస్థలకు ఈ పురస్కారాలను అందజేస్తుంది. సామాన్యుల నుంచి మొదలుకొని శక్తివంతుల వరకు ఈ అవార్డు గ్రహీతల్లో ఉంటారు. సమాజానికి తోడ్పడంలో వారు సాధించిన అసాధారణ విజయాలకు ఈ అవార్డులను అందుకుంటారు.