పశ్చిమ బెంగాల్ చరిత్రలో ఒక సరికొత్త అధ్యాయం మొదలుకానుంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఘనవిజయం సాధించిన భారతీయ జనతా పార్టీ (BJP)..రాష్ట్రంలో తొలిసారిగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సిద్ధమైంది. మే 9వ తేదీన పశ్చిమ బెంగాల్ నూతన ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకార కార్యక్రమం జరగనుందని అధికారిక వర్గాల సమాచారం.
బీజేపీ శాసనసభాపక్షంలో బెంగాల్ బీజేఎల్పీ నేతను ఎన్నుకోనుండగా మే 9న కోల్‌కతాలోని రాజ్‌భవన్‌లో గవర్నర్ సమక్షంలో ఈ ప్రమాణ స్వీకార మహోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా సహా పలువురు కేంద్ర మంత్రులు, ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరయ్యే అవకాశం ఉంది.
సుమారు మూడు దశాబ్దాల వామపక్షాల పాలన, ఆ తర్వాత 15 ఏళ్ల తృణమూల్ కాంగ్రెస్ పాలనను దాటుకుని బీజేపీ బెంగాల్ పీఠాన్ని దక్కించుకోవడం విశేషం. అధికార టీఎంసీపై ఉన్న వ్యతిరేకత, అవినీతి ఆరోపణలు బీజేపీకి కలిసి వచ్చాయి.
‘సోనార్ బంగ్లా’ (బంగారు బెంగాల్) నినాదంతో బీజేపీ ప్రజల్లోకి వెళ్లడం, అభివృద్ధిపై ఆశలు రేకెత్తించడం వారి విజయానికి దోహదపడింది.ప్రస్తుతానికి ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరనే దానిపై ఉత్కంఠ కొనసాగుతోంది. రాష్ట్రంలో పార్టీ గెలుపులో కీలక పాత్ర పోషించిన సీనియర్ నేతలతో పాటు, కేంద్ర నాయకత్వం సూచించే పేరుపై చర్చలు నడుస్తున్నాయి. ప్రమాణ స్వీకారానికి ముందే పార్టీ అధిష్టానం అధికారికంగా సీఎం పేరును ప్రకటించనుంది.
Also Read:గోదారి గట్టుపైన..ఎంజాయ్ చేస్తారు!

