రైజింగ్ పూణె సూపర్ జెయింట్స్ ఐపీఎల్ ఫస్ట్ క్వాలిఫయర్‌లోనే సెన్సేషనల్ విక్టరీ కొట్టింది. ఆరంభంలో వరసు ఓటములతో డీలా పడ్డా తర్వాత పుంజుకుని అన్ని జట్ల కంటే మెరుగైన ఆటతీరుతో ఛాంపియన్ రేసులో నిలిచింది. వరుస విజయాలతో మంచి జోరుమీదున్న ముంబై ఇండియన్స్ మీద హ్యాట్రిక్ విక్టరీ కొట్టి… ఏకంగా ఫైనల్ బెర్త్ నే కన్ఫామ్ చేసుకుంది. బ్యాటింగ్.. బౌలింగ్.. ఫీల్డింగ్ అన్ని విభాగాల్లో బాగా ఆడి.. 20 రన్స్ తేడాతో ముంబైని మట్టికరిపించింది.
టాస్ గెల్చిన ముంబై ఇండియన్స్ పుణె టీమ్ ను ముందుగా బ్యాటింగ్ కు ఆహ్వానించింది. పుణె విధించిన 163 పరుగుల లక్ష్యచేధనలో చితికిలబడింది. లంగ ఉన్న ముంబై బ్యాటింగ్ లైనప్.. ఈ స్కోరును ఈజీగ బీట్ చేస్తుందని అనుకున్నారంతా. కాని సీన్ రివర్సైంది. స్ట్రైకింగ్ బౌలర్ స్టోక్స్ లేకపోయినా… పుణె బౌలర్లు ఆకట్టుకున్నారు. సరైన సమయంలో వికెట్లు పడగొట్టుకుంటూ… ముంబైని దెబ్బతీశారు. సిమన్స్ త్వరగానే రనౌట్ అయ్యాడు.
వాషింగ్టన్ సుందర్ ఒకే ఓవర్ల రోహిత్ శర్మ, అంబటి రాయుడును ఔట్ చేసి ముంబైకి దడ పుట్టించాడు. ఆ తర్వాత ఓవర్లో పొలార్డ్ ను కూడా ఔట్ చేసి.. లోకల్ టీమ్ వెన్ను విరిచాడు. అంతే.. ముంబై… డిఫెన్స్ లో పడిపోయింది. గెలిపిస్తారనుకున్న అన్నదమ్ములు హార్దిక్ పాండ్య, కృణాల్ పాండ్య చేతులెత్తేశారు. మరోవైపు పట్టుదలగా ఆడిన పార్థివ్ పటేల్ తో కలిసి ఆడేవారే కరువైంది. పార్థివ్ 40 బంతుల్లో 52 రన్స్ చేసి ఏడో వికెట్ గా ఔటయ్యాడు.రన్స్ కొట్టేవారు లేకపోవడంతో.. రన్ రేట్ బాగా పెరిగిపోయింది.దీంతో ముంబై ఓటమి ఖాయమైంది. 20 ఓవర్లల్లలో 9 వికెట్లకు 142 రన్సే కొట్టింది ముంబై. దీంతో.. రైజింగ్ పుణె 20 రన్స్ తేడాతో గెల్చి సంబురం చేసుకుంది.
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన పుణె.. రెండు ఓవర్లలో 9 పరుగులకే రాహుల్ త్రిపారి (0)¸, స్టీవ్ స్మిత్ (1) వికెట్లను చేజార్చుకుంది. మలింగ, మెక్లెనగన్, బుమ్రా కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో ఆరు ఓవర్లకు 33/2తో నిలిచింది. త్వరగా రెండు వికెట్లు పడ్డాక పుణెను ఆదుకున్న రహానె, తివారి వికెట్ల పతనాన్ని అడ్డుకున్నా.. అవసరమైనంత వేగంగా పరుగులు మాత్రం చేయలేకపోయారు. 12 ఓవర్లలో స్కోరు 83/2. రహానె 39 బంతుల్లో అర్ధశతకం సాధించాడు. తర్వాతి ఓవర్లో కర్ణ్ శర్మ బౌలింగ్‌లో రహానె ఔటయ్యాక పుణె స్కోరు వేగం ఇంకా తగ్గింది. క్రీజులోకి వచ్చిన ధోని పరుగుల కోసం ఆపసోపాలు పడ్డాడు. సింగిల్స్ కోసం కూడా చెమటోడ్చాడు. ఆరంభంలోనే ఓ సిక్స్ కొట్టినా.. ఎదుర్కొన్న తొలి 17 బంతుల్లో అతడు చేసింది 14 పరుగులే. కానీ 19, 20 ఓవర్లలో ధోని.. భారీ షాట్లతో ఇన్నింగ్స్ స్వరూపాన్నే మార్చేశాడు. ధోని రెండు సిక్స్‌లు.. తివారీ 4, 6 బాదడంతో మెక్లెనగన్ వేసిన 19వ ఓవర్లో ఏకంగా 26 పరుగులొచ్చాయి. బుమ్రా వేసిన ఆఖరి ఓవర్లో ధోని మరో రెండు సిక్స్‌లు దంచడంతో పుణె స్కోరు 160 దాటింది.