భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI)…. ఇండియన్ ప్రిమియర్ లీగ్ (IPL)లో తీవ్ర చర్చనీయాంశంగా మారిన ‘ఇంపాక్ట్ ప్లేయర్’ నిబంధనపై అన్ని ఫ్రాంచైజీల నుండి అభిప్రాయాలను కోరింది. బౌలర్లకు నరకం చూపుతూ భారీ స్కోర్ల నమోదుకు కారణమై, తీవ్ర భిన్నాభిప్రాయాలకు దారితీసిన ఈ 12వ ఆటగాడి నిబంధనపై తమ అభిప్రాయాలను సమర్పించాలని జట్టు యాజమాన్యాలను కోరింది.
మ్యాచ్ డే నిర్వహణ (PMOA), అంపైరింగ్, ప్రాక్టీస్ సెషన్లు మరియు మ్యాచ్ పరిస్థితులకు సంబంధించిన ఇతర విషయాలపై కూడా ఫ్రాంచైజీల సూచనలను బీసీసీఐ కోరింది. అయితే జట్లకు పంపిన సమాచారంలో అత్యంత కీలకమైన అంశం మాత్రం ‘ఇంపాక్ట్ ప్లేయర్’ నిబంధనే అని ‘క్రిక్‌బజ్’ సేకరించిన ప్రతి ద్వారా వెల్లడైంది.
ముగిసిన ఐపీఎల్ సీజన్‌పై ఫ్రాంచైజీల అభిప్రాయాలు సేకరించడం సాధారణ ప్రక్రియే అయినప్పటికీ, ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధన కనీసం మరొక సీజన్ పాటు కొనసాగుతుందని భావిస్తున్న తరుణంలో ప్రత్యేకంగా దీనిపై అభిప్రాయాలు కోరడం ఆసక్తికరంగా మారింది. ఐపీఎల్ 2026 ప్రారంభానికి ముందు జరిగిన కెప్టెన్ల సమావేశంలో ఈ నిబంధనను మరో ఏడాది కొనసాగిస్తామని బీసీసీఐ/ఐపీఎల్ నిర్వాహకులు సూచనప్రాయంగా తెలిపారు. విశేషమేమిటంటే, తాజాగా పంపిన లేఖలో కూడా బీసీసీఐ ఆ కెప్టెన్ల సమావేశాన్ని ప్రస్తావించింది.
రోహిత్ శర్మ, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, శుభ్‌మన్ గిల్ వంటి అనేక మంది అగ్రశ్రేణి ఆటగాళ్లు ఈ నిబంధనను బహిరంగంగానే వ్యతిరేకించారు. అయినప్పటికీ, దీనికి మద్దతు ఇచ్చే వారు కూడా లీగ్‌లో లేకపోలేదు. సర్దుమణిగిందనుకున్న ఈ వివాదాన్ని మళ్లీ తెరపైకి తేవడంతో వచ్చే సీజన్‌లో ఈ నిబంధన కొనసాగుతుందా లేదా అనేది వేచి చూడాలి.
“ఐపీఎల్ 2026 కెప్టెన్ల సమావేశంలో చర్చించినట్లుగా, టోర్నమెంట్ ముగిసిన తర్వాత క్రికెట్ ఆపరేషన్స్ వ్యవహారాలపై అన్ని ఫ్రాంచైజీల నుండి అభిప్రాయాలను సేకరించాలని నిర్ణయించాం. కాబట్టి మీ క్రికెట్ ఆపరేషన్స్ బృందాలతో చర్చించి, మీ అభిప్రాయాలను మాకు పంపవలసిందిగా కోరుతున్నాం” అని బీసీసీఐ తన ఈమెయిల్‌లో పేర్కొంది.
Also Read:రాహుల్ అసత్యప్రచారం..మోదీ ఫైర్
ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధనతో పాటు గత ఐపీఎల్ సమయంలో అక్రమ వ్యక్తులు PMOA (ఆటగాళ్లు, మ్యాచ్ అధికారుల కేటాయించిన ప్రాంతం) పరిధిలోకి రావడం ద్వారా అవినీతి నిరోధక నిబంధనలను ఉల్లంఘించడం మరో ప్రధాన సమస్యగా మారింది. దీనివల్ల సీజన్ మధ్యలోనే ఆటగాళ్లు, సపోర్ట్ స్టాఫ్ మరియు యజమానులకు బీసీసీఐ మార్గదర్శకాలు జారీ చేయాల్సి వచ్చింది. ‘మ్యాచ్ డే మ్యాటర్స్’ కింద క్యాటరింగ్, PMOA మరియు ఇతర సంబంధిత అంశాలను బీసీసీఐ ఈ లేఖలో చేర్చింది.

