9 దేశాల్లో కవితక్క ‘బతుకమ్మ’

373
- Advertisement -

‘బతుకమ్మ’ అంటే బ్రతుకుదెరువును మెరుగు పరచే అమ్మయని అర్థం. దేవీదేవతల్లో బతకమ్మను మనం లక్ష్మీదేవిగా, గౌరీదేవిగా పూజిస్తాం. తెలంగాణ సాంస్కృతిక జీవంగా ప్రజల మనోభావాలకు ప్రతీకగా నిలిచిన బతుకమ్మ ప్రతీ ఆడపిల్ల బతుకు పండగ. ప్రజలకు, ప్రకృతికి మధ్య కొలువై తెలంగాణ ఆడపడుచుల హృదయాన్ని ఆవిష్కరించింది ఈ బతుకమ్మ. ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నుంచి నవమి వరకు ఈ సంబురం జరుగుతుంది. నవమి రోజున జరుపుకునే పండగను ‘సద్దుల బతుకమ్మ’ అని అంటారు. ఈ పాడ్యమికి ముందు భాద్రపద బహుళ పంచమి నాటి నుంచి తొమ్మిది రోజులు అనగా మహాలయ అమావాస్య వరకు బొడ్డెమ్మ పండగగా జరుపుకుంటారు.

trs-kavitha

9 రోజుల పాటు తీరొక్క పూల రంగులతో తెలంగాణ మురిసిపోనుంది..! ఉయ్యాల పాటల రాగాలతో కోటి రతనాల వీణ పులకించనుంది.. తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలను భవిష్యత్‌ తరాలకు అందిస్తున్న తెలంగాణ జాగృతి బతుకమ్మను విశ్వవ్యాప్తం చేయనుంది. రాష్ట్రంలో 1100 చోట్ల… అటు తొమ్మిది దేశాల్లో బతుకమ్మ పండుగ జరిపేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి..

BATHUKAMMA

అక్టోబరు 1న లండన్లో బంగారు బతుకమ్మ వేడుకలకు తెర లేవనుంది. అక్టోబరు 2న అమెరికాలోని శాన్ ఫ్రాన్సిస్కో… అక్టోబర్ 8న ఆస్ట్రేలియాలోని సిడ్నీ… అక్టోబరు 9న న్యూజీలాండ్లోని ఆక్లాండ్… అక్టోబరు 13న కువైట్… అక్టోబర్ 14న బహ్రెయిన్ లో బతుకమ్మ పండుగ జరగనుంది. ఇక చివరగా అక్టోబర్ 15న డెన్మార్క్ లోని కోపెన్ హగన్లో వేడుకలతో విదేశాల్లో బతుకమ్మ సంబరం ముగియనుంది.

bangaru-bathukamma

రాష్ట్రంలో ఈ యేడు రికార్డు స్థాయిలో 1100 చోట్ల బతుకమ్మ పండుగ నిర్వహించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. బతుకమ్మ పండుగ నిర్వహణ కోసం మొత్తం 15 కోట్లు ప్రభుత్వం మంజూరు చేసింది. జిల్లాల్లోని ప్రతి నియోజకవర్గంలో 9 చోట్ల బతుకమ్మ సంబురం వైభవంగా జరగనుంది. అక్టోబర్ 8న హైదరాబాద్లోని ఎల్బీ స్టేడియంలో భారీ ఎత్తున బతుకమ్మ పండుగ జరగనుంది. దాదాపు పదివేల మందికి పైగా మహిళలు ఈ వేడుకలో భాగం కానున్నారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున జరిగే ఈ ఉత్సవాలను గిన్నిస్ రికార్డుల్లో చోటు కల్పించే దిశగా కసరత్తు చేస్తున్నారు.

Kavitha

- Advertisement -