తెలంగాణలో పూల పండుగ…

383
Bathukamma Festival Celebrations Starts
- Advertisement -

రాష్ట్రంలో మళ్లీ పూల పండుగ వచ్చేసింది. ఇవాళ ఎంగిలిపూలతో బతుకమ్మ సంబురాలు మొదలయ్యాయి.  వర్షాకాలం చివర్లో.. శీతాకాలం మొదట్లో పండగకు ప్రకృతి ఆత్మీయ స్వాగతం పలుకుతోంది. పసుపు గౌరమ్మను చేసి పూలతో అలంకరిస్తూ బతుకమ్మను తయారు చేస్తున్నారు మహిళలు.

ఇందులో గుమ్మడి, తంగేడు, గునుగు, రుద్రాక్ష, బీర, బంతి, కట్ట పూలు, గన్నేరు, గోరింట, అడవి మల్లె, సీతమ్మ జడ పూలు.. ఇలా తీరొక్క పూలతో బతుకమ్మను పేరుస్తారు. ఈ పూలన్నింటిలోనూ ఔషధ గుణాలు కూడా ఉంటాయి. బతుకమ్మలను నిమజ్జనం చేయడం వల్ల… నదులు, బావుల్లోని నీటిలో ఔషధ గుణాలు చేరతాయని చెబుతారు పెద్దలు.

పెత్రమాస సందర్భంగా ఎంగిలి పూల బతుకమ్మ పేరుతో తొమ్మిదిరోజులు వేడుకలు జరుగుతాయి. అష్టమి రోజు అంగరంగవైభవంగా జరిగే సద్దుల బతుకమ్మతో సంబురాలు ముగుస్తాయి. ఒక్కోరోజు తయారు చేసే నైవేద్యాన్ని బట్టి.. బతుకమ్మను ఒక్కొక్క పేరుతో పిలుస్తారు.

ఇవాళ మహా అమావాస్య సందర్భంగా బతుకమ్మ మొదటిరోజు వేడుక మొదలవుతుంది. పెత్రామాస రోజు ఎంగిలిపూల బతుకమ్మగా పిలుచుకుంటారు. ఇవాళ నువ్వులు, బియ్యం పిండి, నూకలు కలిపి నైవేద్యం తయారు చేస్తారు. రెండో రోజున అటుకుల బతుకమ్మ అంటారు. పప్పు, బెల్లం, అటుకులతో ప్రసాదం తయారు చేస్తారు. మూడో రోజున ముద్దపప్పు బతుకమ్మ అంటారు.

మొదటి రెండు రోజులు బొడ్డెమ్మగా కొలిచే మహిళలు.. మూడోరోజు లక్ష్మీదేవిగా ఆరాధిస్తారు. ఈ రోజున ముద్దపప్పు, బెల్లం, పాలతో ప్రసాదం తయారు చేస్తారు. నాలుగో రోజు జరుపుకునే బతుకమ్మను నానబియ్యం బతుకమ్మ అంటారు. గౌరమ్మగా ఆరాధిస్తారు. ఈ రోజున పాలు, బియ్యం నానేసిన బియ్యం ప్రసాదం తయారు చేస్తారు. అయిదో రోజు జరుపుకునే వేడుకను అట్ల బతుకమ్మ అంటారు. ఈ రోజున దోసెలు ప్రసాదంగా వేస్తారు.

బతుకమ్మలో ఆరో రోజున అలిగిన బతుకమ్మ అంటారు. ఈ రోజున అసలు బతుకమ్మను పేర్చరు. అంటే ఆరోజున ఆట ఉండదన్నమాట. ఏడో రోజున వేపకాయి బతుకమ్మ అంటారు. సకినాల బతుకమ్మగా కూడా పిలుస్తారు. ఈ రోజున సకినాల పిండిని వేపకాయ ఆకారంలో ముద్దలు చేసి నూనెలలో వేయించి ప్రసాదం తయారు చేస్తారు. ఎనమిదో నిర్వహించే వేడుక వెన్నముద్దల బతుకమ్మ. ఈరోజున దుర్గమ్మగా కొలుస్తారు. ఆరోజు నువ్వులు, వెన్న లేదా నెయ్యి బెల్లం పలిపి నైవేద్యం తయారు చేస్తారు.

సంబురాల్లో చివరి రోజున సద్దుల బతుకమ్మ అంటారు. ఈ రోజు తెలంగాణ అంతా పూల వనంలా మారుతుంది. బతుకమ్మ సాగనంపే రోజు కావడంతో చివరి రోజును ఘనంగా జరుపుకుంటారు. మహిళలంతా గౌరమ్మను పేర్చి గౌరవంగా పూజిస్తారు. సాయంత్రం బతుకమ్మలాడి,.. ఊరిచెరువులో నిమజ్జనం చేస్తారు. సకల సౌభాగ్యాలూ అనుగ్రహించడానికి మళ్లీ రమ్మని వేడుకుంటూ వీడ్కోలు పలుకుతారు.

- Advertisement -