దీపావళీ అనడంతోనే మనకు ముందుగా గుర్తుకు వచ్చేవి టపాకాయలు. చిన్నపెద్ద తేడాలేకుండా టపాసులు కాలుస్తుంటారు. అయితే ప్రస్తుతం ఈ టపాసుల వల్ల పెను ప్రమాదం పొంచిఉందని వాతావరణ, వైద్య నిపుణులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఎక్కువగా చైనా పటాసుల వల్ల పెను ప్రమాదం తప్పదని వాటిని కొనుగోలు చేయడం వెంటనే బహిష్కరించాలని వాతావరణ నిపుణులు హెచ్చారిస్తున్నారు. వీటిలో ఉన్న ప్రమాద, విషపూరిత రసాయనాలు వాతావరణాన్ని, మనుషులను తీవ్ర అనారోగ్యానికి గురి చేస్తాయి… చైనా టపాసుల్లో నాసిరకమే ఎక్కువ.
ఇవి చేతిలోనే పేలే ప్రమాదం పొంచి ఉంది. శివ కాశీ లాంటి ఉన్నత ప్రమాణాలు కలిగిన సంస్థల్లోని టపాకాయలను కొనుగోలు చేయడం వల్ల ప్రమాదాలు తక్కువగా జరిగే అవకాశం ఉంది. అయితే వ్యాపార లావాదేవీలే లక్ష్యంగా చైనా టపాసులు తయారవుతున్న నేపథ్యంలో వాటి తయారీలో ప్రమాదకర రసాయనాలను వాడుతున్నారని సమాచారం. అయితే సాధ్యం అయినంత వరకు చైనా టపాసులను బహిష్కరించి స్వదేశీ పటాసులనే వాడడం మంచిదని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.
దీపావళి సందర్భంగా భారత్‌లోని ముఖ్య నగరాల్లో బాణాసంచా అమ్మకాల్లో గత కొన్ని సంవత్సరాలుగా క్షీణత కనిపిస్తున్నట్లు అసోచామ్ సర్వే తెలిపింది. పర్యావరణ కాలుష్యంపై పెరిగిన అవగాహన, పెరిగిన ధరలు, కష్టపడి సంపాందించిన డబ్బును ఆదా చేసుకునే ధోరణి పెరగడం తదితర అంశాలు టపాసుల అమ్మకాల్లో క్షీణతకు కారణమని సర్వే పేర్కొంది.
బాణాసంచా అమ్మకాలు తగ్గుతున్నాయని.. గత ఐదేళ్ల నుంచి ప్రతి ఏడాది దాదాపు 20 శాతం తక్కువ అమ్మకాలు నమోదవుతున్నాయని వ్యాపారులు తెలిపారు. తక్కువ అమ్మకాల వల్ల కొన్నిసార్లు తెచ్చిన సరుకులో సగం కూడా అమ్మలేకపోతున్నామని వ్యాపారులు తెలిపారు. చైనా బాణాసంచాపై నిషేధంలాంటి అంశాలు స్వాగతించదగినవే. దేశీయ ఉత్పత్తుల అమ్మకాలను ఇది పెంచుతుంది.