మోడీ సర్కారు తీసుకున్న కరెన్సీ రద్దు నిర్ణయంతో ఇప్పుడు ప్రతీ ఒక్కరు బ్యాంకుల వెంట పరుగులు పెడుతున్నారు. పొద్దున్న లేచింది మొదలు జనాలంతా డబ్బుల కోసమే బ్యాంకులు, ఏటీఎంల ముందు పడిగాపులు గాస్తున్నారు. దీంతో బ్యాంక్ ఉద్యోగులకు తలకు మించిన భారంగా మారింది. దీంతో ఉద్యోగులు తీవ్ర ఒత్తిడికి గురౌతున్నారు. ఇటీవల బ్యాంకు పనుల్లో 50 మంది ప్రజలు, 11 మంది బ్యాంక్ సిబ్బంది మృతి చెందారు. అయితే, అలాంటివేమీ జరగకుండా ఇప్పటివరకూ బ్యాంకర్లు తమ సేవలందిస్తూనే ఉన్నారు. పని ఒత్తిడితో బ్యాంకర్లు బంద్ కు పిలుపునివ్వబోతున్నారంటూ ఇప్పటికే ఎన్నో పుకార్లు చెలరేగాయి.
ఇప్పుడిక ఆల్‌ఇండియా బ్యాంక్ అధికారుల సమాఖ్య చేస్తున్న సంచలన ప్రకటనలు చూస్తుంటే ఏదో జరుగబోతోందన్న సంకేతాలు కనిపిస్తున్నాయి. వీరి మృతికి ఆర్బీఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్ బాధ్యత వహించాలని ఆల్ ఇండియా బ్యాంక్ అధికారుల సమాఖ్య ఉపాధ్యక్షుడు థామస్ ఫ్రాంక్ డిమాండ్ చేశాడు. నోట్లు రద్దు చేసిన దేశాల వైఫల్యాలను పరిగణనలోకి తీసుకోకుండా విధ్వంసం సృష్టించారని ఫ్రాంక్ మండిపడ్డారు.
ప్రధాని నరేంద్ర మోదీ, ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీలు ఆర్థిక వేత్తలు కారని, ఓ ఆర్థికవేత్తగా ప్రస్తుత ఆర్బీఐ గవర్నర్ ఉర్జిత పటేల్, నోట్ల రద్దు వంటి అత్యంత కీలకమైన నిర్ణయం తీసుకోవడంలో ఘోరంగా విఫలమయ్యారని ఆయన ఆరోపించారు. రద్దు చేసే ముందు రోడ్ మ్యాప్ కరవైందని, ప్రస్తుతం ఆర్థిక వ్యవస్థలో కొనసాగుతున్న గందరగోళానికి, సామాన్య ప్రజల ఆందోళన, మరణాలకూ ఇదే కారణమని ఆయన అన్నారు.
రూ. 500 నోట్లు లేకుండా రూ. 2 వేల నోట్ల విడుదల నిర్ణయం అత్యంత తప్పిదమని చెప్పిన ఫ్రాంక్, రూ. 100 నోట్లను సిద్దం చేసివుంటే పరిస్థితి ఈ స్థాయికి దిగజారేది కాదని అంచనా వేశారు. నోట్ల సైజు తగ్గించాలని భావించినప్పుడు ఏటీఎంలలో వాటిని సర్దుబాటు చేసే అంశం గుర్తుకు రాకపోవడం వింతగా ఉందని ఫ్రాంకో వ్యాఖ్యానించారు. ఆపై పొంతన లేని ప్రకటనలు రోజుకొకటి చేస్తూ, ప్రజలను ఆర్థిక శాఖ, ఆర్బీఐ తీవ్ర గందరగోళంలోకి నెడుతున్నాయని, అన్నింటికీ బాధ్యత వహించి ఉర్జిత్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. పదిలక్షల కోట్ల పెట్టుబడులు, లక్ష బ్రాంచ్‌లు ఉన్న సహకార బ్యాంకులను పక్కనబెట్టడం గ్రామాల పొట్టకొట్టడమేనని థామస్ ఫ్రాంక్ విమర్శించారు. ఈ విమర్శలదాడి మరింత ముదిరి ఇది బ్యాంకుల సమ్మెకు ఎక్కడ దారితీస్తుందోనన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.